సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు..
పారిశుధ్యం, మెడికల్ క్యాంపులు పక్కాగా నిర్వహించాలి
ప్రత్యేక దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలకూడదు..
దివ్యాంగుల దర్శనాలకు ప్రాధాన్యత నివ్వాలి
శైవ క్షేత్రాలు వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలి..
మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ..
జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కని దర్శనం కలిగేలా మహా శివారాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు
స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఈ నెల 15న మహా శివారాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13 నుండి 18 వరకు భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధ శైవ క్షేత్రాలతోపాటు, మిగిలిన ప్రాంతాల్లో కూడా మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలసి బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలైన రెండు ప్రముఖ పంచారామ క్షేత్రాలు భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరు అవుతారని వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. గత సంవత్సరాల వేడుకల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి సంఘటనలకు ఆస్కారం లేనివిధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, త్రాగునీటి సరఫరా, చిన్నారులకు పాలు, పెద్దవారికి అల్పాహారం, దర్శనం చేసుకున్న ప్రతిభక్తునికి ఉచిత ప్రసాదం పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంచినీటి నాణ్యతను పరీక్షించి సరఫరా చేయాలన్నారు. శ్రీశైలం సంఘటన, పొరుగు జిల్లాలో గత సంవత్సరం సంఘటనలను దృష్టిలో ఉంచుకొని గోదావరి, సముద్ర స్థానాలకు వెళ్ళే భక్తులకు జాగ్రత్తలు తెలియజేసేలా టాo.. టాo.. వేయించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. రెండు శైవ క్షేత్రాలలో ప్రాధమిక వైద్యసేవలు అందించేందుకు వైద్యులను, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. 108 వాహనాలు కుడా అందుబాటులో ఉంచాలని సూచించారు. రెండు పంచారామాలతో పాటు, నత్తా రామేశ్వరం, మావుళ్ళమ్మ దేవస్థానాలు వద్ద క్యూ లైన్లు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. విఐపి, ప్రోటోకాల్ దర్శనాలను క్రమబద్దీకరిస్తూ సామాన్య భక్తులకు, దివ్యాంగులకు అత్యధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. రథయాత్రలు, తెప్పోత్సవాలు నిర్వహణకు ముందస్తుగా ఆర్ అండ్ బి అధికారులకు తెలియజేసి, సర్టిఫికెట్ పొందాలన్నారు. భక్తులకు ప్రసాద వితరణ కచ్చితంగా చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్ధం అవసరమైన పీఏ సిస్టం ఏర్పాట్లను కుడా చేయాలన్నారు. అదే విధంగా జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా సుమారు 3 వేల నుండి 10 వేల వరకు భక్తులు వచ్చే దేవాలయాలను గుర్తించి రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. ఎక్కడ కుడా భక్తులకు అసౌకర్యాలు కలగుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పగడ్బంధిగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 14, 15 తేదీలలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాలకు అదనంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీ, ఏర్పాట్లు, తదితర అంశాలను అంచనా వేసేందుకు రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందితో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. క్యూ లైన్ల క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా డ్రోన్లను వినియోగించాలన్నారు. శివరాత్రి సందర్భంగా ఎటువంటి వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్టీవోలు, డిఎస్పిలు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, వైద్య, ఫైర్, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.