Close

సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాయోధుడు స్వర్గీయ దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 14/02/2026

దామోదరం సంజీవయ్య 105వ జయంతోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దామోదరం సంజీవయ్య చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు దామోదరం సంజీవయ్య అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ఆయన సాధారణ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప ప్రజానాయకుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. దామోదరం సంజీవయ్య 14 ఫిబ్రవరి 1921 కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో జన్మించారన్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. అయన శాసనసభ్యుడిగా ఎన్నికై వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారన్నారు. ఆయన పాలనలో పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశారన్నారు. సాధారణ కుటుంబం నుంచి దేశ స్థాయికి ఎదిగిన మహోన్నత నాయకుడని, దామోదరం సంజీవయ్య సేవలను స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన సంక్షేమ వసతి గృహాల అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు మధ్యలో డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలన్నారు. సంక్షేమ వసతి గృహాలలో ప్రవేశాలు నూరు శాతం ఉండేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్య, ఆరోగ్య అంశాలపై దృష్టి పెట్టి బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణ కుమారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, వసతిగృహాల సంక్షేమ అధికారులు, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.