Close

సాగునీరు అందక ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 27/07/2026

ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేయాలి

జిల్లాలో ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా శివారు ప్రాంతాల పంట పొలాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో సాగునీటి సరఫరా పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, పోడూరు మండలం వద్దిపర్రు, గుమ్ములూరు, పెనుమదం, కవిటం గ్రామాల్లో సుమారు 760 ఎకరాలకు, అలాగే యలమంచిలి మండలంలోని యలమంచిలి, మేడపాడు గ్రామాల్లో 150 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించి ఆయా గ్రామాల పంట పొలాలకు వెంటనే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ కాలువల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించాలని, ఎక్కడైనా అవరోధాలు ఉంటే వెంటనే తొలగించి రైతులకు నిరంతర సాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో సాగునీరు అందక ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందులు ఎదుర్కోకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతి వారం సాగునీటి సరఫరా పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్..వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఏఈ యు.రమేష్, ఇరిగేషన్ డీఈలు, నీటి సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.