Close

సాంఘిక శాస్త్రంలో కష్టమైన అంశాలను స్వయంగా బోధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 14/02/2026

భీమవరం పి ఎస్ ఎం బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన పదవ తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోని కష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, విధులు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక అంశాలు వంటి క్లిష్టమైన పాఠ్యాంశాలను విద్యార్థినులకు అర్థమయ్యేలా బోధించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను క్రమబద్ధంగా అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రతి రోజూ పాఠ్యాంశాలను పునశ్చరణ చేయడం, గత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం, ముఖ్యమైన ప్రశ్నలను గుర్తుంచుకోవడం అవసరమని చెప్పారు. విద్యార్థులు కష్టమైన అంశాలను భయపడకుండా ఉపాధ్యాయుల సహకారంతో స్పష్టత పొందాలని, సందేహాలు ఉంటే వెంటనే అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో బోధించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.