Close

సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 18/02/2025

పశ్చిమగోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతంలో తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు…

అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల గుడ్లు సంరక్షణకు ప్రత్యేక హెచ్చరిస్ ఏర్పాటు..

గత నెల రోజులుగా 41 ఆలీవ్ రెడ్ల్లీ సముద్ర తాబేళ్ళు పెట్టిన సుమారు 4,440 గుడ్లు హెచ్చరిస్ ఏర్పాటుతో సంరక్షణ..

రానున్న రెండు నెలల్లో మరో 25 వేలు గుడ్లు పెట్టే అవకాశం…

సముద్ర తీర ప్రాంత సంరక్షణకు మడ అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి..

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

మంగళవారం నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతం చినమైనవానిలంక గ్రామంలో తాబేళ్లగుడ్లు సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడ్ల సేకరణ – సంరక్షణ – పునరుత్పత్తి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పరిశీలించారు. అటవీశాఖ అధికారులను గుడ్లు సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సముద్ర వాతావరణ సమతుల్యత దెబ్బ తినకుండా సముద్ర జీవులను రక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. గత మాసంలో పెద్ద ఎత్తున తాబేళ్ళు చనిపోయి పెదమైనవానిలంక, చినమైనవానిలంక సముద్ర తీర ప్రాంతానికి కొట్టుకుని రావడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ విషయమైన సంబంధిత అధికారులతో సమావేశమై తాబేళ్ళు సంరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించడంతోపాటు, తాబేళ్ళు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు పోస్టుమార్టం కూడా చేయించడం జరిగిందని, నివేదిక అందాల్సి ఉంటుందన్నారు. తదుపరి చర్యల్లో భాగంగా అటవీశాఖ పర్యవేక్షణలో తాబేళ్ళు వచ్చి గుడ్లు పెట్టే ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. ఒక్కొక్క తాబేలు సుమారు 60 నుండి 150 గుడ్లు పెడుతుందని, కుక్కలు, ఇతర జంతువులు, ఆకతాయిలు నుండి గుడ్లను సంరక్షించేందుకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు తాబేళ్ళు గుడ్లు పెట్టే సమయం అని, ఏప్రిల్ అనంతరం గుడ్లు పిల్లలు బయటకు వస్తాయన్నారు. రెండు నెలల కాలంలో ఇంకో 25 వేలు గుడ్లు పెట్టే అవకాశం ఉందని, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తిరిగి సముద్రంలో విడిచేందుకు స్కూల్ విద్యార్థులను, స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామన్నారు. తద్వారా విద్యార్థులలో సముద్ర జీవుల పట్ల అవగాహన కల్పించేందుకు తోడ్పడుతుందన్నారు. వచ్చే సంవత్సరంలో ఒక లక్ష గుడ్లు పిల్లలుగా ఎదిగేందుకు రక్షణ చర్యలను చెప్పటనున్నట్లు తెలిపారు. సముద్రం అంచున కట్టిన వలలను అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్య కాలంలో మత్స్యకారులు తొలగించాలని, తద్వారా తాబేళ్ళు సముద్రం ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. మానవ మనుగడకు సముద్ర వాతావరణం సమతుల్యత దెబ్బ తినకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సముద్రతీర ప్రాంతం కోతకు గురికాకుండా విరివిగా మడ అడవులను పెరగనిద్దాం.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చినమైనవానిలంక తాబేళ్ళు గుడ్లు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం దర్భరేవు, రాజులుపాలెం ప్రాంతాల్లోని మడ అడవులను బోటులో వెళ్ళి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటికే చినమైనవారి లంక, పెదమైనవానినలంక ప్రాంతాల్లో సముద్రం చాలా ముందుకు చొచ్చుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దత్తత గ్రామమైన పెద్దమైనవానీలంకలో ఒక కిలోమీటర్ మేర రక్షణ గోడను రూ.35 కోట్ల వ్యయంతో నిర్మించడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ పనులను ఎలైట్ కంపెనీ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాస్తవంగా ఏడు కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాల్సి ఉందని, ప్రస్తుతం ప్రయోగత్మకంగా ఒక కిలోమీటర్ మాత్రమే రక్షణ గోడను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక రైతులతో తాబేళ్లు సంరక్షణ, మడ అడవులు పరిరక్షణపై జిల్లా కలెక్టర్ మాట్లాడి, తగు సూచనలు చేశారు. మడ అడవులు లేకపోవడం వల్లే తీర ప్రాంతం పెద్ద ఎత్తున కోతకుగురి అవుతున్నదనే విషయం తెలిసిందేనని, దీనివలన ముఖ్యంగా నష్టపోయేది తీర ప్రాంత ప్రజలేనన్నారు. ఈ విషయాన్ని గుర్తించి వాటి సంరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు.

తొలుత చిన్న మైనవానిలంక వెళ్లే మార్గమధ్యంలో నల్లిక్రిక్ వంతెనను ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన మరమ్మతులకు రూ.20 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించి వంతెన పటిష్టతకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశ కిరణ్, నరసాపురం ఆర్టీవో దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీ వేద, తాహసిల్దార్ రాజరాజేశ్వరి, సర్పంచ్ బడుగు ఏసుబాబు,, డిఎల్పిఓ, ఎక్సైజ్, పోలీస్, రెవిన్యూ, మెరైన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

1.22  1.11 1.33