సమాజ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి–శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
పాలకోడేరు మండలం శృంగవృక్షం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ర్యాంక్ సిలికాన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం
రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతొ ఈ ఉన్నత పాఠశాలలో 4 అదనపు తరగతి గదులను నిర్మించిన దాతలు సయ్యపరాజు అప్పల నరసింహరాజు, పార్వతి దంపతులను అభినందించారు. పాఠశాలలో ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థానాలలో ఉన్నారని వారు కూడా సయ్యపరాజు అప్పల నరసింహ రాజును స్ఫూర్తిగా తీసుకొని ఈ పాఠశాలకు, సొంత గ్రామానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు రావాలన్నారు. సొమ్ము సంపాదనతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. మానవ జీవితం అశాశ్వతమని, మనతోరాని డబ్బు కొన్ని సేవా కార్యక్రమాలు చేపడితే జన్మ సార్ధకమవుతుందన్నారు. సంపన్న కుటుంబాల వారు పేద కుటుంబాల వారికి చేయూతనివ్వడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి పి ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ముఖ్యమంత్రి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ పాఠశాలకు ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం అయితే వాటిని కూడా సమకూరుస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను కలెక్టర్ అభినందించారు. ఈ పాఠశాలలో అనుభవిజ్ఞులైన నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని అన్నారు. ఈ పాఠశాల నుండి నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పాఠశాలలో ప్రవేశానికి సీటు దొరకదు అనే విధంగా పాఠశాలను తీర్చిదిద్దాల అన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాలలో ప్రవేశాలు లేవనే బోర్డు పెట్టే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉండి శాసనసభ్యులు విద్యాభివృద్ధి కోసం అనేక పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో దాతలను సంప్రదించి పాఠశాలలకు కుర్చీలు, టేబుల్స్, ల్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల్లో కూడా విద్యార్థులకు బెడ్స్ అందించేందుకు దాతలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా అదనపు తరగతి గదుల నిర్మాణ దాతలు సయ్యప్పరాజు అప్పల నరసింహారాజు, పార్వతీ దంపతులను శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఘనంగా సన్మానించారు.
. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ప్రధానోపాధ్యాయులు తోట కాశీ జగన్నాథరావు, గ్రామ సర్పంచ్ జంగా సూరిబాబు, అదనపు తరగతి గదుల దాతలు సయ్యపరాజు అప్పల నరసింహ రాజు పార్వతి దంపతులు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
