Close

సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 29/07/2025

మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోస్, ఎంఈఓస్, ఏపీఎంస్, మున్సిపల్ కమిషనర్స్, సిటీ మిషన్ మేనేజర్స్, వయోజన విద్యా సూపర్వైజర్స్ కు నిర్వహించిన జిల్లా స్థాయి “అక్షర ఆంధ్ర” అక్షరాస్యత 2025-26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన ద్వారా జిల్లాలో 15 – 59 వయస్సు మధ్య కలిగిన 2,23,911 మంది నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందని, వీరిని మూడు భాగాలుగా విభజించి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం తొలి విడతగా 69,392 మందికి ఆగస్టు నుండి ప్రారంభించి మార్చి వరకు అక్షరాస్యత తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. 2029 నాటికి లక్ష్యంగా జిల్లాలో నిరక్షరాస్యులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రధస్థానంలో ఉంచేందుకు సంబంధిత అధికారులు నిరంతరాయంగా కృషి చేయాలన్నారు. ఉదాసీనంగా తరగతులను నిర్వహించరాదని, దీని వెనుక ఎంతో లక్ష్యం ఉందన్నారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అక్షరాస్యత కార్యక్రమాన్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లేలా ఆదేశించడం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న మన జిల్లాలో రెండు లక్షల పైబడి నిరక్షరాస్యులు ఉండడం ఒకసారి ఆలోచన చేయాలన్నారు. నిరక్షరాస్యలకు శిక్షణ తరగతులు అంటే ఒక సంతకం నేర్పి విడిచి పెట్టడం కాదని, వారికి రాయడం, చదవడం, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతలపై పూర్తి పట్టు సాధించేలా నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులందరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు. నిరక్షరాస్యులు తెలుగులో మాట్లాడడం, విని అర్థం చేసుకోవడం తెలుసని, వీరికి పది రోజుల్లోనే చదవడం, రాయడం పెద్ద కష్టం కాదన్నారు. జీవితంలో ఏ పని చేయాలన్నా ఒక లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ సవాలుగా తీసుకోవాలని, డి ఆర్ డి ఏ., డ్వామా, మెప్మా సిబ్బంది పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా “అక్షర వెలుగు” సంక్షిప్త వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సి.హెచ్ ప్రభాకర్, డి ఆర్ డి ఎ పి డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామా ఏపీడి జీవీకే మల్లికార్జునరావు, జిల్లా విద్యాశాఖ ఏడి ఎన్.సత్యనారాయణ, మెప్మా ఏవో హెప్సిబా, వైఎస్న విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కెవివి సత్యనారాయణ, ఎంపీడీవోస్, ఎంఈఓస్, ఏపీఎంస్, మున్సిపల్ కమిషనర్స్, సిటీ మిషన్ మేనేజర్స్, వయోజన విద్యా సూపర్వైజర్స్, తదితరులు పాల్గొన్నారు.