సమాజంలో స్థూలంగా జరిగే అభివృద్ధిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు “స్త్రీ శక్తి పథకం” ప్రవేశపెట్టడం జరిగిందని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు
శుక్రవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో “స్త్రీ శక్తి” ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు “స్త్రీ శక్తి పథకాన్ని” ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రాజ్యసభ సభ్యులు పాత వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో స్థూలంగా జరిగే అభివృద్ధిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆటో యూనియన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఇది సరైనది కాదన్నారు. ఈ పథకం వలన ఆటో చోదకులకు ఏ విధమైన నష్టం జరగదని, ప్రభుత్వం కూడా వీరి గురించి ఒక ఆలోచన చేస్తున్నదని తెలిపారు. ఎన్నికల హామీలల్లో భాగంగానే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజంలో అర్ధ భాగమైన మహిళలు కుటుంబాలకు కుటుంబం నడిపే బాధ్యత ఏర్పడిందని, చాలామంది మహిళలు దూరాభారం వెళ్లి పనులను చేసుకొని ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీరికి వచ్చే జీవితంలో ఆదాయాన్ని నష్టపోకుండా కొంత ప్రభుత్వం అండగా నిలిచేందుకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసిందన్నారు. స్త్రీ శక్తి మహిళలకు శక్తిని పెంచి కర్తవ్య బాధ్యతగా పనిచేస్తుందన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తారన్నారు. మహిళా సాధికారతఅనే ఆలోచన ముఖ్యమంత్రి మనసుకు దగ్గరగా ఉంటుందని దీనిలో భాగంగానే ఆనాడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటును ఇచ్చారన్నారు. మహిళలు సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం తోడ్పడుతుందన్నారు. గ్రామీణ మహిళలు, కళాశాలలకు వెళ్లే బాలికలు, వయసులో ఉన్న మహిళలకు ఈ పథకం ప్రయోజనంగా ఉంటుందన్నారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3 వేళ పెన్షన్ నాలుగు వేలకు, దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు , రైతు భరోసా కింద రూ.7 వేలు, తల్లికి వందనం పేరిట రూ.13 వేలు అందజేయడంతో పాటు, నేడు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. కూటమి ఫోటో ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తుందన్నారు.


