Close

సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించడం పీ4 ప్రధాన లక్ష్యం-ఇన్చార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

Publish Date : 06/08/2025

 పీ4 లక్ష్యసాధనకు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలి.

పి4 లో భాగంగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వశిష్టా సమావేశ మందిరం నందు బుధవారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించి పేదరికంలేని సమాజాన్ని రూపొందించాలన్నదే పి4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు సేవ చేద్దామనే సదుద్దేశం ఉన్న స్థితిమంతులకు పి4 ఒక మంచి వేదిక అన్నారు. సమాజంలో 10 శాతంగా ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది నిరుపేదలకు చేయూత నివ్వడమే పి4 లక్ష్యమన్నారు. జిల్లాలో ఇంతవరకు 65 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని వారి అవసరాల మేరకు మార్గదర్శకులు ఆర్థికంగా, నైపుణ్య పరంగా, ఉపాధి కల్పన, వైద్య సహాయం ద్వారా ఆ బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు తమ వంతు సహాయం అందించాలని ఆయన కోరారు. మీ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వపు విద్యార్థులకు కూడా పి4 పై అవగాహన కల్పించి వారు మార్గదర్శకులుగా చేరి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. అదేవిధంగా మీ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా మార్గదర్శకులు కావచ్చు అన్నారు. విద్యకు దూరంగా ఉన్న పేద పిల్లలను ఏ విధంగా విద్యావంతులను చేయవచ్చు ఆలోచన చేసి జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తే దానిని కార్యాచరణలో పెట్టడం జరుగుతుందని ఇన్చార్జి కలెక్టర్ కె.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పి4 ప్రభుత్వ ఆశయ సాధనకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని విద్యాసంస్థల యాజమాన్యాలు తెలిపారు.

ఈ సమావేశంలో డిఇఓ ఇ.నారాయణ, సిపిఓ కె.శ్రీనివాసరావు, జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.