Close

సమస్య తమ శాఖ పరిధిలోనికి కానిపక్షంలో నిర్ణీత గడప వరకు ఉంచకుండా వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేయాలి … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 28/04/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో పలు ప్రాంతంలో నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 246 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కానీ ఎడల మండల స్థాయి అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్య తమ శాఖ పరిధిలోనిది కానప్పుడు నిర్ణీత గడప వరకు వేచి ఉండకుండా సంబంధిత శాఖకు ఎండార్స్ చేయాలని ఆదేశించారు. ఎక్కువ ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్న శాఖలకు ఏప్రిల్ 30న గూగుల్ మీట్ ద్వారా వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని, సమస్యల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, ఎలా పరిష్కరించవచ్చు, తదితర విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

వచ్చిన ఫిర్యాదులలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి

@ తాడేపల్లిగూడెంకు చెందిన తోపు సాయి కిషోర్ 25 సంవత్సరములు పుట్టుకతో వెన్నుముక ఇబ్బంది, కిడ్నీ సమస్యతో పూర్తి వికలాంగుడిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేల పింఛనుతో కాలం గడుపుకుంటున్నానని అన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుచున్నానని, ప్రభుత్వం ద్వారా 15 వేల రూపాయలు పింఛను మంజూరు చేయాలని కోరగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కలెక్టరేట్ కాంపౌండ్లో వీల్ చైర్ పై ఉన్న అతని వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని నిబంధనల ప్రకారం రూ.15 వేలు పించను మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

@ భీమవరం పట్టణం గునుపూడికి చెందిన ముల్లి నాగేశ్వరరావు (68) సంవత్సరాలు. నడవలేని అచేతన స్థితిలో కలెక్టరేట్ పి జి.ఆర్.ఎస్.కి వారి సహాయకులతో వీల్ చైర్ లో రాగా జాయింట్ కలెక్టర్ స్వయంగా వారి దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. రూ.4 వేలు పించను రూ.15 వేల రూపాయలు మంజూరుచేసి ఆదుకోవాల్సిందిగా కోరారు. వారి పరిస్థితి చూసి సత్వరమే వైద్య పరీక్షలు చేయించి సదరం సర్టిఫికెట్ మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తదుపరి 15 వేల రూపాయల పెన్షన్ మంజూరుకు సిఫార్స్ చేయడం జరుగుతుందన్నారు.

@ ఇరగవరం మండలం ఎర్రాయి చెరువు గ్రామానికి చెందిన జుత్తిక సరస్వతి (85) సంవత్సరాలు అర్జీని సమర్పిస్తూ తన మనుమడు నా ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నాడని, నా ఇంటి స్థలం నా కూతురికి చెందేలా న్యాయం చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా ఫిర్యాదుదారునితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

@ నర్సాపురం మండలం సరిపల్లి గ్రామం మైల బత్తుల వేణు గోపాలరావు, పిట్టా చిట్టిబాబు. గ్రామంలో మంచినీటి కుళాయి చెరువు చుట్టూ పోరంబోకు భూమి ఆక్రమించుకుని కొంతమంది ఇల్లు నిర్మించుకొని నివాసాలు ఉంటున్నారు. వారికి వీఆర్వో పట్టాలు ఇస్తామని అంటున్నారు. చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.

@ ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన బంగారు లక్ష్మణరావు, గ్రామ పంచాయతీలో స్వీపరగా పనిచేసి జూన్, 2014 సంవత్సరంలో పదవీ విరమణ చేశానని ఏలూరు జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేసిన పింఛన్ తీసుకుంటున్నానని, జిల్లాల విభజన అనంతరం పింఛన్ రావడం లేదని పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అర్జీలో కోరారు.

@ భీమవరం పట్టణానికి చెందిన చెందిన జక్కుల కుమారి తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని అర్జీని సమర్పించారు.

@ గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన కాలనీవాసులు ఉమ్మడిగా వినియోగించుకుంటున్న కమ్యూనిటీహాలును బళ్ల సంసోను స్వార్థంతో లీజుకు తీసుకుని స్వాధీనంలో ఉంచుకున్నారు. కమ్యూనిటీ హాల్ కి చెందిన కొంత స్థలమును కూడా ఆక్రమించుకున్నారు. చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాల్ లో వేడుకలు జరుపుకునే విధంగా కాలనీవాసులకు అప్పగించాలని జి.రత్నరాజు, బి.ఏసు కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.