Close

సచివాలయాల్లో సిబ్బందిని సిద్ధంగా ఉంచి గ్రామస్థాయిలో సైతం యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 27/10/2025

మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు..

భీమవరంలోని పలు ప్రాంతాలను సందర్శించి అధికారులకు ఆదేశాలు జారీ..

తుఫాన్ కారణంగా ఎటువంటి విపత్తుకు తావులేని విధంగా అధికారులను సన్నద్ధం చేసాం

ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం.

ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్నాం.

తుఫాను ప్రభావితమయ్యే అవకాశం ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం.

పునరావాస కేంద్రాలు గుర్తించి, ఆహార పదార్థాలను, మందులను సిద్ధంగా ఉంచాం.

 

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోని పలు ప్రాంతాలను సందర్శించి జల వనరులు, మున్సిపల్, తదితర శాఖల అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం కూడా పాల్గొన్నారు. తొలుత మెంటే వారి తోటలోని మినామికోడు మురుగు కాలువ వద్ద షట్టర్లను, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం బివి రాజు సెంటర్ నందు యనమదుర్రు డ్రైయిన్ బ్రిడ్జి పై నుండి ప్రవాహ వేగాన్ని గమనిస్తూ ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తదుపరి నీటిపారుదల శాఖ రెస్ట్ హౌస్ ప్రాంగణంలో డంపు చేసిన సరుగుడు బాదులు, తడికలు, ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని పరిశీలించి అన్ని విధాల సిద్ధంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అనంతరం బ్యాంక్ కాలనీ బిఎంకే రైస్ మిల్ ప్రాంతంలో యనమదుర్రు కట్ట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అర్బన్ ప్రాంతంలోని దుర్గాపురంలో వర్షపు నీరు ఎక్కువగా వస్తే పునరావాస కేంద్రానికి తరలించేందుకు భీమవరంలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్డీవోను ఆదేశించినట్లు తెలిపారు. భీమవరం డివిజన్ సంబంధించి భీమవరం రూరల్ లో మూడు, కాళ్లలో ఒకటి, ఆకివీడులో ఒకటి, భీమవరం టౌన్ లో ఒకటి మొత్తం ఆరు పునరావస్తు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు నేటి నుండి మూడు రోజుల వరకు అత్యవసర మైతే తప్ప బయటకి రావద్దు అని, నదీ తీరం సముద్ర తీరం ప్రాంతాలకు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్, రెవిన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, ఎన్ హెచ్, వైద్యం, తదితర శాఖలను పూర్తిస్థాయిలో విధులకు కేటాయించడం జరిగిందని, 36 మందితో కూడిన ఒక ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం కూడా జిల్లాకు రావడం జరిగిందని, అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని, తుఫాను కారణంగా పశువులకు వ్యాధులు సంక్రమించకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతున్నదని తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అవసరమైన చోట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ప్రజలకు సూచనలు చేయడం జరుగుతుంది అని తెలిపారు. కార్తీక మాసం స్నానాలకు ఎవరు సముద్రం, నదీ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటన సంబంధిత పోలీస్ అధికారులకి సమాచారాన్ని అందించాలన్నారు.

ఈ సందర్భంలో భీమవరం ఆర్టీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఎడ్యుకేషన్ శాఖ అధికారి సత్యనారాయణ, ఎ.ఇ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, సహాయ మున్సిపల్ కమిషనర్ బి. రాంబాబు, తదితరులు ఉన్నారు.