శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవం ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవం జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను సంబంధిత శాఖలు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రసాదాలను నాణ్యతతో, రుచికరంగా, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయాలని సూచించారు. క్యూలైన్లో ఏర్పాటు పకడ్బందీగా చేయాలని, భక్తులకు త్రాగునీరు, పిల్లలకు పాలు అందించాలని తెలిపారు. వీటి సరఫరాకు వాలంటీర్లను నియమించాలన్నారు. విద్యుత్ ప్రవాహం కారణంగా ప్రమాదాలు జరగకుండా విద్యుత్ ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. శానిటేషన్ పక్కాగా నిర్వహించాలని, ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం కనిపించకూడదన్నారు. అన్నదానం సత్రం ముందు ఇప్పటికే నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ నిషేధించడం జరిగిందని, ద్విచక్ర వాహనాలను కూడా పార్కింగ్ చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలో దుకాణాలు, అమ్మకాలు రోడ్డు మీదకు రాకుండా కట్టడి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ కలెక్ట్ చేయాలని సూచించారు. నెహ్రూ చౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డి.ఎస్.పి రఘువీర్ విష్ణు, జిల్లా దేవాదాయశాఖ అధికారి ఐ.సూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు, మావుళ్ళమ్మ దేవస్థానం ఈవో బుద్ధ గణేష్, భీమేశ్వర స్వామి టెంపుల్ ఈవో టి.శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఎం.మల్లికార్జున శర్మ, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉష, జిల్లా రవాణా అధికారి యం వి కృష్ణారావు, డిఎంహెచ్వో డాక్టర్ బి. గీతాబాయి, నీరుల్లి సంఘం మరియు ఉత్సవ కమిటీ అధ్యక్షులు మటారపు ఏడుకొండలు, వన్టౌన్ సిఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.