వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు త్రాగునీరు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించాలి.
శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పిఎం సూర్యఘర్, పింక్ టాయిలెట్స్ ఏర్పాటు, పార్కుల అభివృద్ధి అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళ నుండి చెత్త సేకరణ బాగానే జరుగుతుందని, కానీ తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ మందకొడిగా జరుగుతోందన్నారు. వ్యాపార సముదాయాలు వద్ద గుట్టల గుట్టలుగా చెత్త వేయడం జరుగుతోందని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద వచ్చే వ్యర్థ పదార్థాలు రోడ్డుపై పడవేయకూడదని, డస్ట్ బిన్ లో ఉంచి చెత్త సేకరణ వాహనం వచ్చిన తర్వాత వాహనంలో వేసే విధంగా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినియోగించిన కొబ్బరి బొండాలు, మొక్కజొన్న వంటి వ్యర్థ పదార్థాలు రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వేయకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డ్ లలో ఉన్న చెత్తను తొలగించడానికి ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. పింక్ టాయిలెట్స్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. రోడ్ల ఆక్రమణలు తొలగించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పార్కులు అభివృద్ధికి స్థానిక దాతలను గుర్తించి వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్కులు అభివృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడ త్రాగునీటికి కొరత లేకుండా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను పూర్తిగా నింపుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రజలకు త్రాగునీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు వస్తే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో మినరల్ వాటర్ సరఫరా చేస్తున్న ప్రైవేట్ యూనిట్లను తనిఖీ చేసి మంచినీరు క్వాలిటీని పరిశీలించాలన్నారు. ఎండలు తీవ్రత దృష్ట్యా జన సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో షామియానాలు, చలివేంద్రాలు ఏర్పాటుచేసి మంచినీరు, మజ్జిగ ప్రజలకు అందించే ఏర్పాటు చేయాలన్నారు. ఎండలు దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో బ్యానర్లు, గోడపత్రికలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ ల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రెస్టారెంట్లు, హోటల్స్ ను తరచుగా తనిఖీలు చేసే ఆహార పదార్థాలకు వారు వినియోగిస్తున్న ఆయిల్, ముడి సరుకులు క్వాలిటీని తనిఖీ చేయాలని, క్వాలిటీ లేని సరుకులను వినియోగిస్తే వారిపై కేసు నమోదు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే వారికి లభించే సబ్సిడీ, సొమ్ము ఆదా వంటి అంశాలపై ప్రజలు అవగాహన కలిగించాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలు, వేసవి దృష్ట్యా తాము అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికను జాయింట్ కలెక్టర్ కు వివరించారు.
ఈ సమావేశంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య, ఆకివీడు మున్సిపల్ కమిషనర్ జి.కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.