• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

వేకువ జామునే భీమవరం పట్టణంలో శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 04/07/2025

సుమారు రెండు గంటల పాటు భీమవరం పట్టణంలో పారిశుద్ధ్య పనులు తనిఖీలు..

పారిశుద్ధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం ఊహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవ్..

భీమవరం పట్నంలోని 1, 5, 6 డివిజన్ ల్లోని పిపి రోడ్డు, ప్రకాశం చౌక్, డిఎన్ఆర్ కాలేజ్ బీసీ కాలనీ, వీరమ్మ మున్సిపల్ పార్క్ ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాలు ముందు పారిశుద్ధ్య పనులు పరిశీలన..

వాణిజ్య సముదాయాల ముందు చెత్త వేస్తే చర్యలు తప్పవని సంబంధిత యజమానులకు సూచించడంతోపాటు, నిబంధనలు అతిక్రమించిన వారికి అపరాధర రుసుమును విధించాలని మున్సిపల్ కమిషనర్నుకు ఆదేశాలు..

రోడ్లపై వర్షపు నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలి, డ్రైన్ లలో సిల్ట్, చెత్త తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి..

ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బుధవారం మార్కెట్ అన్న క్యాంటీన్ సందర్శించి, ఆహార పదార్థాలను రుచి చూసిన జిల్లా కలెక్టర్.

వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది..

ఆహార పదార్థాలను పరిశుభ్ర వాతావరణంలో ప్రజలకు అందించాలి..

శుక్రవారం వేకువజామునే జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పట్టణంలోని రోడ్లు మీద ప్రత్యక్షం కావడంతో మున్సిపల్ అధికారులలో అలజడి ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు పట్టణంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య సముదాయ ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణను జిల్లా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. రోడ్ల పైన, వాణిజ్య సముదాయాలు, హోటల్స్, తోపుడు బళ్ళు ముందు చెత్తను వేస్తే చర్యలు తప్పవని సంబంధిత యాజమాన్యాలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరు డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకుని చెత్తను వేసుకోవాలని, మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు చేస్తున్నదని, ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తే సహించేది లేదన్నారు. ఎక్కడ చెత్త కనిపించినా ఫోటో తీసి, పెనాల్టీ విధించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. భీమవరం జిల్లా ముఖ్య కేంద్రం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, దేశ విదేశాల్లో భీమవరానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, మనం చెత్తతో నింపివేస్తే భీమవరం పట్టణ గొప్పతనాన్ని మనమే దెబ్బతీసిన వారమవుతామన్నారు. జిల్లా ఆక్వా రంగానికి ప్రసిద్ధిగాంచడంతో ఎంతోమంది భీమవరంకు వచ్చి వెళుతూ ఉంటారని వారు మన పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా చెప్పుకునే అంత గొప్పగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలన్నారు. చెత్త వేస్తే డ్రెయిన్లు పూడుకుపోయి వర్షపు నీరంత రోడ్లమీద నిల్వ ఉండి ప్రజా రవాణాకు అసౌకర్యంగా ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. చిన్నపాటి జ్వరం వచ్చిన పరీక్షల పేరిట వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్న విషయం మీ అందరికీ తెలిసిందేనన్నారు. ఆర్థికంగా, అనారోగ్యంగా నష్టపోవడం కంటే ముందస్తుగా ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు.

అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బుధవారం మార్కెట్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార పదార్థాలను రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం అల్పాహారం చేస్తున్న వారితో మాట్లాడుతూ ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటున్నాయా, పరిశుభ్రమైన వాతావరణం లో వడ్డిస్తున్నారా అని ఆరా తీశారు. ఆహార పదార్థాలు అన్నీ బాగుంటున్నాయని, వివిధ పనుల మీద భీమవరం వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో, రుచికరమైన ఆహారం పొందుతున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, ఈగలు కారణంగా అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వాష్ ఏరియాను, ఫ్లోర్ ను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తరచూ ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, ఎంహెచ్ఓ ఆర్.సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, తదితరులు ఉన్నారు.