Close

విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

Publish Date : 24/07/2026

#పశ్చిమగోదావరి జిల్లాలో వైభవో పేతంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్.

#తల్లిదంద్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కు విశేష స్పందన.

** జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

విద్యా రంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల ఫలితాలు విద్యార్థులకు పూర్తిగా అందాలంటే తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

ఉండి మండలం, చెరుకువాడ జడ్పీ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మెగా “పేరెంట్-టీచర్ మీటింగ్ – వెర్షన్ 4.0” (PTM-4.0) కార్యక్రమానికి శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత ఘనంగా నిర్వహించటం జరిగింది. పాఠశాల ఆవరణలను అందంగా అలంకరించి, పండుగ వాతావరణంలో తల్లిదండ్రులకు, ప్రముఖులకు సాదర స్వాగతం పలికారు. విద్యార్థుల అభ్యసన ప్రతిభను, ప్రగతి నివేదికలను పరిశీలించి తల్లిదండ్రులతో నేరుగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల, తల్లిదండ్రుల భాగస్వామ్యమే పునాదిఅని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పాఠశాలల్లో సాంకేతికతకు అనుగుణంగా కంప్యూటర్లు, ల్యాబ్ లు, లైబ్రరీ వంటి మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం జరుగుతున్నదని అన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి భావి పౌరులుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వటం ఉపాధ్యాయులను అభినందించారు. భారతదేశంలోని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీప్ యాప్ ను ప్రవేశపెట్టిందని అన్నారు. దీని ద్వారా విద్యార్థుల దినచర్య తెలుసుకునేందుకు తల్లిదండ్రులకు అనువుగా ఉంటుందని అన్నారు. యాప్ లో విద్యార్థులకు సంబంధించిన వివరాలు హాజరు, మధ్యాహ్న భోజన పథకం, విద్యా ప్రగతి, తల్లికి వందనం, విద్యా ప్రమాణాల వివరాలు, స్పోర్ట్స్ కు సంబంధించిన వివరాలు సమాచారాన్ని పొందవచ్చని అన్నారు. గతంలో విద్యార్థులకు డైరీలలో ఇంటి వద్దకు హోంవర్క్ ఇచ్చేవారని ఇప్పుడు యాప్ అందుబాటులో ఉండటం వలన సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. సభాముఖంగా విద్యార్థులచే “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ప్రసంగించారు. పేద విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాకూడదని తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే తప్పక ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు. తల్లిదండ్రులు విద్యుతో పాటు తమ పిల్లలకు మంచి ఉన్నత విలువలను నేర్పించాలని అన్నారు. విద్యార్థులు చదువులోనే కాక ఆటలు, పాటలు వంటి అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని అప్పుడే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. వృత్తి నైపుణ్యం సాధించినప్పుడే చదువుకున్న చదువుకు సార్ధకత చేకూరి మంచి ఉపాధి అవకాశాలు పొందగలుగుతారని అన్నారు. విద్యార్థులు తరచూ లైబ్రరీలకు వెళ్లి మంచి పుస్తకాలను అభ్యసిస్తే జ్ఞానం పెంపొందిందుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేయటం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు క్రీడలలో ఆసక్తి కనపరిచి క్రీడాకారులుగా రూపొందాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉన్నతికి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని తెలియజేశారు. పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు పాఠశాలల అభివృద్ధిపై ద్రుష్టి సారించాలని అన్నారు.
ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా లీప్ యాప్ (LEAP App) ని ఉపయోగిస్తూ తమ పిల్లల చదువును పర్యవేక్షించాలన్నారు.
ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌లో LEAP App ను డౌన్‌లోడ్ చేయించి నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ యాప్ ద్వారా పిల్లల రోజువారీ హాజరు, తరగతి సమయ పట్టిక, హోమ్‌వర్క్‌లు, మార్కులు, డిజిటల్ డైరీ వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్‌లోనే తెలుసుకోవచ్చని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సమావేశమై తమ పిల్లల చదువు, హాజరు, ప్రవర్తన, అభ్యాస స్థాయి, ప్రోగ్రెస్ కార్డ్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కు ప్రతి తల్లిదండ్రి బడి వైపుకు అడుగులు వేయాలని అన్నారు. వారి సలహా సంప్రదింపులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత తమందికి తల్లిలు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు.
**తోలుత పాఠశాల ఆవరణలోని తరగతి గదులను తనిఖీ చేసి పాఠశాల ల్యాబ్ లో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలను పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన కాలంకారి వస్తు ప్రదర్శనను తిలకించి, విద్యార్థులను ప్రశంసించారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో విద్యార్థులు తమ తల్లులకు పూలతో పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సభలో విద్యార్థులు కెరియర్ మార్గదర్శకాలు గురించి అడిగిన సందేహాలకు జిల్లా కలెక్టర్ బదులుగా తాము పాఠశాల విద్యాభ్యాసం అనంతరం టెక్నికల్ కోర్సులకు సంబంధించిన వృత్తి విద్యా కోర్సులు ఎంచుకుంటే త్వరగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందగలుగుతారని తెలియజేశారు. విద్యార్థులు ముందు నుంచే ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే తాము అనుకున్నా లక్ష్యాలను సులువుగా సాధించగలిగి ఉన్నత స్థాయిలో స్థిరపడతారని అన్నారు. తాము భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులను, పెద్దలను మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ, హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అక్బర్ చక్రవర్తి, ఎమ్మార్వో రాంప్రసాద్ రాజు, ఎండిఓ ఎం వి ఎస్ ఎస్ శ్రీనివాస్, సీఎంఓ చంద్రశేఖర్, విద్యాశాఖ ఏడి ఎన్.సత్యనారాయణ, ఎంఈఓ లు లక్ష్మీనారాయణ, వినాయకుడు, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.