Close

విభిన్న ప్రతిభావంతులు ధైర్యంగా ముందుకు నడవాలని, సాధారణ వ్యక్తులకు తీసిపోని విధంగా అన్ని రంగాలలో మీ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.

Publish Date : 06/12/2025

విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆటల మైదానం నందు ఏర్పాటుచేసిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత విభిన్న ప్రతిభావంతులు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానిస్తూ అందజేసిన పుష్పగుచ్చాలను ప్రేమ, ఆప్యాయతలతో పలకరిస్తూ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోనూ తక్కువ కాదనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైందన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని, మంచి భవిష్యత్తును పొందాలని సూచించారు. ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల ప్రేమ అనురాగాలు ఉన్నాయని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. వీటితోపాటు విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను కూడా ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడవాలని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లాస్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ద్విచక్ర వాహనాల పోటీలు, రన్నింగ్, షాట్ పుట్ పోటీలను ప్రారంభించే స్వయంగా తిలకించి దివ్యాంగులను ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి బి.రామ్ కుమార్, డిఎస్డిఓ ఎన్. మోహన దాసు, తహసిల్దార్ రావి రాంబాబు, ఆర్ పి డి యాక్ట్ కమిటీ సభ్యులు నండూరి రమేష్, అల్లాడే నటరాజ్, తోట రాము, సంపత్, కందుల సురేష్, రమణ, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కళ్యాణి, ప్రసాద్, విభిన్న ప్రతిభావంతులు, తదితరులు పాల్గొన్నారు.