విభిన్న ప్రతిభావంతులకు పూర్తి సబ్సిడీతో మూడు చక్రాల మోటారు వాహనాల పంపిణీకి భీమవరం, ఉండి నియోజకవర్గాల లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన పూర్తి
అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి మూడు చక్రాల మోటార్ వాహనాల అందజేత
… జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ స్కూటీలను మూడు చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. దివ్యాంగులు మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం నవంబర్ నెలలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను బుధవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలనతో పాటు అభ్యర్థుల ఇంటర్వ్యూలను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మొదటి విడతలో భీమవరం మరియు ఉండి నియోజకవర్గాలకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుంచి మొత్తం 32 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు గాను ప్రతి నియోజకవర్గానికి 10 మోటార్ స్కూటీలు చొప్పున మొత్తం 70 పెట్రోల్ స్కూటీలు మంజూరు చేయబడినట్లు వెల్లడించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేపడతామని పేర్కొన్నారు. లబ్ధిదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, వైట్ రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. లబ్ధిదారుల పేరుపై ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదన్నారు. విద్యార్థులు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలు, పురుషులకు సమాన అవకాశాల కల్పనలో భాగంగా 50 శాతం మహిళలకు, 50 శాతం పురుషులకు మంజూరు చేయనున్నట్లు వివరించారు. లబ్ధిదారుల అర్హతలు, శారీరక ఫిట్నెస్ను పరిగణనలోకి తీసుకుని పెట్రోల్ స్కూటీలను మూడు చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.
రెండవ విడతగా జూన్ 4న తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు అదే రోజు తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మూడవ విడతగా జూన్ 5న పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాలకు సంబంధించిన కార్యక్రమం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్లో సమర్పించిన ధ్రువపత్రాల రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు, వైకల్యం స్పష్టంగా కనిపించే ఫోటో, రీ-వెరిఫికేషన్ సదరం ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ జిరాక్స్, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, అదనపు అర్హత సర్టిఫికెట్లు మరియు పూర్తి సైజు రెండు పాస్పోర్ట్ ఫోటోలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన మరియు ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు మోటారు వాహనాలను అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి.అరుణ కుమారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పుష్పరాణి, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.