Close

వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలి

Publish Date : 20/08/2025

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు నిషేధం

ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదు.

వినాయక చవితి పందిళ్లలో సాంప్రదాయ భక్తి పాటలను మాత్రమే వినిపించాలి

వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలి

. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

వినాయక చవితిలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిషేదించాలని, ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు రానున్న వరసిద్ధి వినాయక ఉత్సావాలు, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వినాయక ఉత్సవాలలో మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను భక్తిశ్రద్ధలతో పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉందన్నారు. వేలల్లో విగ్రహాలు పూజింపబడతాయని, మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని వుండదని తెలిపారు. నిమజ్జన సమయంలో గజ ఈతగాళ్లు తగినంతమంది ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ అధికారికి సూచించారు. కోలాటం, భజన వంటి సాంప్రదాయ కార్యక్రమాలను మాత్రమే పందిళ్ల వద్ద ఏర్పాటు చేయాలని, రికార్డింగ్ డాన్స్ లు, డీజేలు ఏర్పాటు చేయరాదన్నారు. ఆర్చిలు, పట్టణంలో పలు ప్రాంతాల్లో డెకరేషన్ లైటింగ్, అరటి తోరణాలు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లీచింగ్, శానిటేషన్, త్రాగు నీరు, స్టేజి, లైటింగ్ ఏర్పాట్లు, బ్యారికేడింగ్ పోలీస్ వారితో సమన్వయము చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. నిమజ్జన కార్యక్రమం కొరకు నీటి నిల్వ తగినంత ఉండేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఎటువంటి బాణాసంచ పెల్చరాదని ఆదేశించారు. ఆర్టీసీ వారు బస్ ట్రాఫిక్ రూట్ సమన్వయం పోలీస్ వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అంబులెన్స్ ల ఏర్పాటు, ప్రథమ చికిత్స ఏర్పాటు ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. ఏపీఎస్పీడిసిఎల్ వారు పవర్ కట్ లేకుండా చూడాలని, కరెంట్ తీగలు వేలాడుతుంటే వాటిని సరిచేయాలని, నిమజ్జన ప్రాంతంలో జనరేటర్ తదితర ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని పట్టణాల్లో, మండలాల్లో కూడా పోలీస్, రెవెన్యూ, మండల అధికారులు, పంచాయితీ రాజ్, మునిసిపల్ అధికారులు సమన్వయంతో వినాయక విగ్రహ ఏర్పాట్లు, నిమజ్జన ఏర్పాట్లు సామరస్యంగా ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వినాయక చవితి పండుగ వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అధికారులు అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. విగ్రహాల నిమర్జన ఎట్టి పరిస్థితుల్లో సాగునీటి కాలువలు, త్రాగునీటి చెరువులలో చేయరాదన్నారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా వినాయక చవితి మహోత్సవం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా గతం కన్నా మెరుగ్గా వినాయక చవితి ఉత్సవాలు జరిగేల చూడాలని కోరారు. సింగిల్ విండో విధానంలో ఫైర్, విద్యుత్, పోలీస్, మునిసిపల్ తదితర అధికారులు ఒకే వేదికలో కూర్చునెలా ఏర్పాటుకు పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా చూడాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు రెండు మూడు రోజులు ముందే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండపాలలో భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుందని, ఇతర పాటలు ఉండరాదని కోరారు. ఎలాంటి గొడవలు పడకుండా అందరూ ప్రశాంతంగా వినాయక మహోత్సవాలు జరిగేలా అందరూ సహకరించాలని, త్రాగి గొడవలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జనానికి నిర్దేశించిన ప్రదేశాలను మాత్రమే వినియోగించాలని, అక్కడ మాత్రమే పోలీస్ బందోబస్తు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఖతీబ్ కౌసర్ భానో, డీఎస్పీలు ఆర్.జయసూర్య, డా.శ్రీ వేద, డి.విశ్వనాథ్, డిపిఓ ఎన్.రామ్ నాథ్ రెడ్డి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డి ఎం అండ్ హెచ్ ఓ జి.గీతా బాయి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.రాంబాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇ.ఇ వెంకటేశ్వరరావు, దేవాదాయ, ఎక్సైజ్ శాఖల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.