విద్య అనేది మనందరి జీవితంలో ముఖ్యమైన ఘట్టమని, షైనింగ్ స్టార్స్ గా ప్రతిభా పురస్కారాలను విద్యార్థులు అందుకోవటంలో విద్య కీలకమైన అంశమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ -25 ప్రతిభా పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే మరియు పిఎసిఎస్ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు సమాజం అభివృద్ధిలో వెనుకబాటుతనానికి కారణం అందరూ విద్యను అభ్యసించకపోవడమేనని, అందరూ విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలంటే విద్య ముఖ్యమైన సాధనమని, అటువంటి విద్యను విద్యార్థులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందుకోవటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అందరిని బడికి పంపిస్తే, బడికి వచ్చిన విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దటం ఉపాధ్యాయుల కర్తవ్యమని అన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపటంలో విద్య క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి విద్యను అందరికీ చేరువు చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేసుకుని వాటిని అమలుపరుస్తూ రాష్ట్రంలో విద్య ప్రగతి పథంలో దూసుకుపోయే విధంగా కార్యాచరణలు కొనసాగించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బడి ఈడు గల పిల్లలు బడికి రావాలని దృఢ సంకల్పంతో తల్లికి వందనం పథకం ఏర్పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్ కిట్స్ లో భాగంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్, షూస్ మొదలైనవి ఉచితంగా పంపిణీ చేయడం, విద్యార్ధులకు శారీరక దృఢత్వం పెంపొందించే విధంగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, ప్రతి నెల విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, ఆడపిల్లల్లో రక్తహీనత తగ్గించడానికి ప్రతి గురువారం ఐరన్ టాబ్లెట్ ల పంపిణీ, నులిపురుగుల నివారణకు ప్రతి ఆరు నెలలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ వంటి విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయికి మించి తయారుచేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పట్టిష్ట స్థితికి చేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈ విధమైన విద్యా వ్యవస్థను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో తమ ప్రతిభాపాటవాలను చూపి అత్యుత్తమ ఫలితాలను సాధించి నేడు షైనింగ్ స్టార్స్ గా ప్రతిభా పురస్కారాలను పొందడం ముదావహమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు.
రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్య వస్తుంది గాని సంస్కారానికి దూరం అవుతున్నారని అన్నారు. సంస్కారంతో కూడిన విద్యను నేర్చినప్పుడే పరిపూర్ణ వ్యక్తిగా ఉండగలనన్నారు. జ్ఞానాన్ని సముపార్జించి దేశానికి, జాతికి ఉపయోగపడేలా నడుచుకోవాలన్నారు. పోటీ ఆలోచనలు తల్లిదండ్రులు మానుకోవాలని, వారి ప్రతిభా పాటవాలను గుర్తించి ఆ రంగంలో రాణించేందుకు ఆసరాగా నిలబడాలని హితవు పలికారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసిఎస్ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో అత్యధిక నిధులను కేటాయిస్తుందన్నారు. చదువు వలనే మన అభివృద్ధి అని, బావి భారత పౌరులు మీరే అని చదువు వలన రాష్ట్రం, దేశం గర్వించ తగిన స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టమైన పిల్లలను తప్పక చదివించాలని, పిల్లలకి అవసరమైన యూనిఫామ్, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అన్ని ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్చుకోవడానికి ప్రభుత్వ బడులే సరైనవన్నారు. విద్య దారిద్రయాన్ని పారద్రోలి మంచి భవిష్యత్తును ఇస్తుందన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ మాట్లాడుతూ 2024 -25 సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులను గుర్తించి “షైనింగ్ స్టార్స్ పేరిట” ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఓసి బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ లలో పదో తరగతిలో 600 మార్కుల్లో 500 మార్కులు గాని, 83.33 శాతం మరియు అంతకంటే ఎక్కువ శాతం సాధించిన వారిని 119 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు, అలాగే ఇంటర్మీడియట్ విద్యలో 830 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 34 మంది విద్యార్థులను గుర్తించి, ఒక్కొక్కరికి ప్రశంసా పత్రం, మెడల్, రూ.20 వేల చెక్కును అందజేసి సత్కరించుకోవడం జరిగిందన్నారు.
చివరిగా 153 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రం, మెడల్, రూ.20 వేల చెక్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంలో విద్యార్థులను పలు ప్రశ్నలను అడిగి ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఏ.నాగేశ్వరరావు, ఏపీసి పి.శ్యామ్ సుందర్, డీఈవో కార్యాలయం ఏడి సత్యనారాయణ, ఏ ఎస్ ఆర్ సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, మాజీ ఏఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, భీమవరం డిప్యూటీ ఈవో ఎన్.రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.