విద్యుత్ సబ్‌స్టేషన్‌ పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 31/10/2026
WhatsApp Image 2026-10-31 at 6.33.43 PM

ఆర్నాబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

ఈ సందర్భంగా నరసాపురం పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి, విద్యుత్ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. అనంతరం మండలంలోని సరిపల్లె గ్రామంలో తుఫాను ప్రభావానికి గురైన బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అందుబాటులో ఉంచిన విద్యుత్ సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అవసరమైన సామగ్రిని సంబంధిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
అనంతరం సరిపల్లె గ్రామంలో తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను కలెక్టర్ పరామర్శించారు. వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంలో ఆర్డిఓ దాసిరాజు, తాహసిల్దార్ నాగార్జున తదితరులు ఉన్నారు.