విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఒక యూనిట్ విద్యుత్ పొదుపు రెండు యూనిట్ల ఉత్పత్తి తో సమానం
ఒక యూనిట్ విద్యుత్ పొదుపు రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో సమానమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం ప్రకాశం చౌక్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ప్రకాశం చౌక్ నుండి పిపి రోడ్, మావుళ్ళమ్మ టెంపుల్, తహసిల్దార్ కార్యాలయం మీదుగా ప్రకాశం చౌక్ వరకు కొనసాగింది. అనంతరం ఇంధన పొదుపుపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిశంబరు 14 నుండి 20 వరకు జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యములో నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగం నానాటికి పెరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని, భావితరాల దృష్ట్యా విద్యుత్తును ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తముగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. పీఎం సూర్యఘర్ స్టాల్స్ ద్వారా సోలార్ విద్యుత్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ పై సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన కొరకు విద్యుత్ సంరక్షణ – భవిష్యత్ రక్షణ, విద్యుత్ పొదుపు చేద్దాం – భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు – రేపటి మదుపు, ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్టి, విద్యుత్ పొదుపు – ప్రగతికి మలుపు, సౌర విద్యుత్ వాడుదాం – ప్రకృతిని కాపాడుదాం, సౌర విద్యుత్ వాడుదాం – కాలుష్యాన్ని నియంత్రిద్దాం, సౌర విద్యుత్ వాడుదాం – విద్యుత్ చార్జీలను నియంత్రిద్దాం, ఇంటింటా విద్యుత్ పొదుపు – ఊరూరా వెలుగు, సేవ్ పవర్ – సేవ్ నేషనల్ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, ఇఇ వెంకటేశ్వరరావు, డిఇలు మధు కుమార్, నరసింహమూర్తి, విద్యుత్ శాఖ సిబ్బంది, విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, భాష్యం స్కూల్, జి ఎస్ ఎన్ స్కూల్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.