విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలి – ఇన్చార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
శుక్రవారం భీమవరం గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, సృజనాత్మకత పెంపొందుతాయని ఆమె అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం తగ్గించి, వారిలో పఠనాసక్తిని పెంచే విజ్ఞానదాయకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పుస్తకాలు చదివే అలవాటును చిన్ననాటి నుంచే పెంపొందిస్తే విద్యార్థుల మేధో వికాసంతో పాటు వివిధ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో పుస్తక పఠనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు, క్విజ్ కాంపిటీషన్, ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన 180 మంది విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ బహుమతులు, అవార్డులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘువీర్ విష్ణు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ సెక్రెటరీ ఎస్ ఎం శేఖర్ బాబు, ఎమ్మార్వో రవిబాబు, గ్రంధాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లూరి నరసింహారాజు, సభ్యులు వివిఎన్ మూర్తి, గ్రంథాలయ శాఖ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్ భవాని, మానవతా సంస్థ సభ్యులు కే గోపాల శర్మ, కుమార వెంకటేశ్వర వరప్రసాద్, సిక్కిని స్కూల్ కరస్పాండెంట్ జ్యోతి, గ్రంధాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.