Close

విద్యార్థులు భవిష్యత్ మార్గ నిర్దేశకులు అని, పాఠశాల విద్య నుండే ఉన్నతంగా చదివి మంచి భవిష్యత్తుకు ఏర్పరచుకోవాలని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Publish Date : 06/01/2025

రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మా లక్ష్యం

అందుకే స్పూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు!

చాగంటి సలహాలతో నైతిక విలువలపై పాఠ్యాంశాలు

ఉండి అభివృద్ధికి రఘురామ చేస్తున్న కృషి భేష్

టాటా సేవలకు గుర్తుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

ఉండి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ సుడిగాలి పర్యటన……

సోమవారం ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకే విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను, సంస్కృతిని గుర్తుచేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి, వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ అభిమని అన్నారు. విద్యా వ్య‌వ‌స్థ‌ను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌ని నేను మొదటి నిర్ణయం తీసుకున్నాను అన్నారు. నేను మంత్రి అయిన వెంటనే రాజకీయ నాయకుల ఫోటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేసానన్నారు. స్కూల్స్ లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు అని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకోని వెళ్ళకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పానని లోకేష్ తెలిపారు.

108 ఏళ్ల చరిత్ర కలిగి ఇటీవల ఆధునీకరించిన ఉండి జెడ్పి హై స్కూల్ భవనంతోపాటు బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. హైస్కూలునుంచి గ్రామంలోకి రూ.18లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఉండి హైస్కూలు నుంచి పెదఅమిరంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత రతన్ టాటా మార్గ్ గా నామకరణం చేసిన భీమవరం – ఉండి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సాగి ప్రసాదరాజు సౌజన్యంతో 35లక్షలతో వాటర్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ వేదికపై నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన అమిరంలోని ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… 108ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.

మనసున్న మహారాజు పీవీజీ రాజు విద్యాభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారన్నారు. ఆయన ఆస్తులు దానం చేసి ఎన్నో స్కూల్స్ ఏర్పాటు చేసారన్నారు. విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చారని, ఎయిడెడ్ స్కూల్స్ వ్యవస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. సిరీస్ రాజు గారి లాంటి ఎంతో మంది గొప్ప వాళ్ళు ఈ స్కూల్ లో చదువుకున్నారనీ తెలిసిందన్నారు. సమావేశానికి వచ్చిన విద్యార్థులను చూస్తే కాలేజి రోజులు గుర్తు వస్తున్నాయాన్నారు. కాలేజిలో ఫ్రెండ్ షిప్ జీవితాంతం గుర్తుంటుందన్నారు. 2019-24వరకు కుటుంబం ఇబ్బందులు పడినప్పుడు నాకు స్నేహితులు అండగా నిలిచారనీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలను మిత్రులకు చెప్పి పరిష్కరించుకోవాలన్నారు. నాకు కఠినమైన ప్రయాణం ఇష్టం. మంగళగిరిలో 1985 తర్వాత టిడిపి గెలవలేదు. 2019లో 5,300 ఓట్లతో ఓడిపోయా. అయిదేళ్లు నియోజకవర్గానికి వదలకుండా కష్టపడ్డా. ప్రజల ఆశీస్సులతో 91వేల మెజారిటీతో గెలిచాను. దేవుడు ఒక్కొకరికి ఒక్కో రకమైన పరీక్ష పెడతాడు. పరీక్షను జయించే శక్తి మనకు ఇస్తాడు. సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించగలం. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి జీవన ప్రయాణం చేయాలన్నారు.

దేశాభివృద్ధిలో రతన్ టాటా కీలకపాత్ర

ఒక వ్యాపార వేత్తగా ఉండి కంట్రీ ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి చివరి వరకు పనిచేసిన వారు రతన్ టాటా. భారతీయ కంపెనీల సమర్థను ప్రపంచానికి చాటిన గొప్ప పారిశ్రామిక వేత్త, విజనరీ రతన్ టాటా. ఇతర దేశాల కంపెనీలను కొనుగోలు చేసి విజయవంతంగా నడిపిన గొప్ప వ్యక్తి ఆయన. టాటా కంపెనీ పేరు వినగానే ఒక గౌరవం, ఒక ఆదరణ, ఒక నమ్మకం కలుగుతుంది. కోట్ల మంది విశ్వాసాన్ని పొందడం, దాన్ని దశాబ్దాలుగా కొనసాగించడం చిన్న విషయం కాదు. దీని వెనక ఎంతో దీక్ష, పట్టుదల, చిత్తశుద్ది ఉంది. రతన్ టాటా సామాజిక కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. మా అమ్మమ్మ క్యాన్సర్ తో చనిపోతే ఎన్టీఆర్ గారు హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ వైద్యం ఉండాలనే ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుచేశారు. ఆ సంస్థ కోసం 1992లో రతన్ టాటా 25కోట్లు విరాళం ఇచ్చారు. 2014 హుద్ హుద్ తుపాను సమయంలో టాటా ట్రస్ట్ సిఇఓకు నేను ఫోన్ చేస్తే 30సెకన్లలో 3కోట్లు సమకూర్చారు. డబ్బివ్వడం గొప్పకాదు, మాకు ఎటువంటి ప్రచారం అవసరం లేదన్నారు. ఆ మహనీయుడు చనిపోయేముందు నేనే బాంబే హౌస్ కు వెళ్లారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. టాటా చైర్మన్ చంద్రశేఖరన్ టిసిఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి 10వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో ప్రజా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేసి యువతకు మెరుగైన నెట్ వర్కింగ్ అందించేందుకు కృషిచేస్తాం.

టాటా గ్రూపును అగ్రగామిగా తీర్చిదిద్దిన రతన్

టాటా గ్రూప్‌ రతన్ టాటా హయాంలోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. టాటా గ్రూపును సాల్ట్ నుంచి సాఫ్ట్ వేర్ వరకు తీసుకెళ్లారు. లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 50 స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టారు. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టాటా పవర్‌, టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎస్ ను.. దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. ‘ఇండికా’ కారును దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా, భారత ఆటోమొబైల్‌ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న వాదానికి ఆయన తెరదించారు. టాటా గ్రూప్‌ నుంచి గతంలో ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పరిధిలోకి తేవాలన్నది రతన్‌ టాటా చిరకాల వాంఛ. అందులో భాగంగానే తమ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా ప్రారంభించిన ఎయిర్‌ ఇండియాను మళ్లీ తమ పరిధిలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్‌ ఇండియాను టాటా కొనుగోలు చేశారు. టాటా ను ఇండియాలోనే కాకుండా ప్రపంచ పటం పై పెట్టిన గొప్ప వ్యక్తి పద్మవిభూషణ్ రతన్ టాటా. 1961లో టాటా గ్రూప్‍లో చేరిన రతన్ టాటా దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలకపాత్ర పోషించించారు. వ్యాపారాలు చేయడం వేరు…విలువలతో కూడిన వ్యాపారాలు చేయడం వేరు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. ఆ కోవలోకి వచ్చే మహనీయుడు రతన్ టాటా. అహర్నిశలు దేశం గురించి ఆలోచించిన రతన్ టాటా విగ్రహం పెట్టిన రఘురామ కృష్ణంరాజుకు అభినందనలు.

చదువుతోపాటు నైతిక విలువలూ ముఖ్యమే

ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లినా మీరు చదువుకున్న స్కూల్స్ ను మర్చిపోకండి. మీరు చదువుకున్న గ్రామాల్లో కంపెనీల శాఖలు ఏర్పాటుచేయండి. ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం”క్రింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాల ఆహార అల‌వాట్ల‌ను గౌర‌విస్తూ పౌష్టికాహారం అందిస్తున్నాం. టీచర్లు చదువు మాత్రమే చెప్పాలి ఇతర పనులు, పనికిమాలిన యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం. 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 944 కోట్లతో ఉచితంగా“సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్”పంపిణీ చేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. త్వరలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నాం. కేజీ టూ పీజీ కరికులం మారుస్తున్నాం. చదువు తో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యం. మహిళల్ని గౌరవించడం చిన్న వయస్సు నుండే నేర్పించాలి. నేను పాదయాత్ర చేసినపుడు అనేకమంది మహిళలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలకు గౌరవించేలా చట్టాలుచేస్తే సరిపోదు, సమాజంలో మార్పురావాలి. మార్పు ఇంటినుంచే మొదలుకావాలి. మార్పుతేవడానికి ఆడ-మగ సమానమనే భావన కల్పిస్తాం. స్కూలు టెక్స్ట్ బుక్ లో సమానంగా ఫోటోలు ఉండేలా చూస్తాం. మహిళలను చులకనగా చేసే పదాలు వాడకూడదు. ఆడ, మగ సమానం అనే భావన కలిగేలా ప్రత్యేక లెస్సన్స్ తీసుకొస్తాం. పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వర రావు గారిని నియమించాం. వారి డైరెక్షన్ లో ప్రత్యేక పాఠాలు రూపొందిస్తాం.

అవిశ్రాంత పోరాట యోధుడు ట్రిపుల్ ఆర్

ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉంటుంది. ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమ నేను అప్పటికీ మర్చిపోలేను. మన ఫైర్ బ్రాండ్ ట్రిపుల్. ఆర్ అంటే రియల్ , రెస్పాన్సిబుల్, రెబల్. ఐదేళ్లు ఎలా పోరాడారో చూసారు కదా. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్యే అయ్యాను, డిప్యూటీ స్పీకర్ అయ్యాను అని ఆర్. ఆర్ . ఆర్ రిలాక్స్ కాలేదు. కొన్ని సందర్భాల్లో నేను రఘురామతో విభేదించాను. చంద్రబాబు అరెస్టు సమయంలో నాకు ట్రిపుల్ ఆర్ అండగా నిలబడ్డారు. రాజద్రోహం కేసుపెట్టి కొట్టినా వెనకడుగు వేయలేదు. తనను కొట్టిన పోలీసులకు వాహనాలు కొనిచ్చిన విశాల హృదయుడు ట్రిపుల్ ఆర్. రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతినెలా 4వేల కోట్ల డెఫిషిట్ ఉంది. సవాళ్లను అవకాశంగా తీసుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం రఘురామ పనిచేస్తున్నారు. కలెక్టర్ గారు అధారిటీ గా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసారు. రఘురామ గారు, ఆయన మిత్రులు చేస్తున్న అభివృద్ధి పనులు గురించి తెలుసుకున్న తరువాత ఆశ్చర్యానికి గురయ్యాను. సుమారుగా రూ.60 లక్షలు ఖర్చు చేసి ఉండి జెడ్పి హై స్కూల్ ను రెన్నోవేట్ చేసారు. నియోజకవర్గం లో 34 స్కూల్స్ ఉంటే 31 స్కూల్స్ లో ఇప్పటికే మరమత్తులు పూర్తి చేసి ప్లే గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేసారు. బీసీ, ఎస్సి వెల్ఫేర్ హాస్టల్స్ లో బెడ్స్ ఏర్పాటు చేసారు. పోలీస్ స్టేషన్స్ ఆధునీకరణ, కొత్త వాహనాలు కూడా సమకూర్చారు. డ్రైన్స్ క్లీనింగ్, పంట కాలువలు శుభ్రం చేస్తున్నారు. సురక్షిత తాగునీరు అందించేందుకు 34 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు – జువ్వలపాలెం రోడ్డు ను కలిపే లింక్ రోడ్డు ను రతన్ టాటా పేరుతో రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా రూ. 10 కోట్లు అభివృద్ధి పనులు కోసం ఆయన, ఆయన ఫ్రండ్స్ ఖర్చు చేసారు. నియోజకవర్గ అభివృద్ధి డిప్యూటీ స్పీకర్ రఘురామ చేస్తున్న కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. రఘురామరాజుగారు చేసిన అభివృద్ధి చూశాక మంగళగిరి ఉండితో పోటీపడాలని భావిస్తున్నా. ఉండి అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం నుంచి సహకారం అందించే బాధ్యత తీసుకుంటా. డ్రగ్స్, గంజాయి వల్ల భవిష్యత్ తరాలు నాశనమయ్యే పరిస్థితి నెలకొంది. చంద్రగిరిలో గంజాయి కారణంగా తన బిడ్డ నాశనమైందని ఒక తల్లి చెప్పింది. మత్తు పదార్థాల నివారణకు డ్రగ్స్ వద్దుబ్రో పేరుతో క్యాంపెయిన్ రూపొందించాం. ఈగల్ టీమ్ లు ఏర్పాటుచేస్తున్నాం. ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. సినిమా ట్రయిలర్ లో వచ్చే ముఖేష్ మాదిరిగా డ్రగ్స్ వల్ల యువత బతుకు దుర్భరంగా మారుతుంది. డ్రగ్స్ వద్దు బ్రో, డోన్డ్ బి ముఖేష్ అని ప్రచారం చేపడుతున్నాం.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ ఎస్ సిపిసి చైర్ పర్సన్ పీతల సుజాత, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకట్రాజు, సొంగ రోషన్ కుమార్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఎం.ధర్మరాజు, భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యులు అంగర రామ్మోహన్, మాజీ శాసన సభ్యులు గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ కె.సౌజన్య, స్కూల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయిన్ డైరెక్టర్ నాగమణి, డీఈవో ఇ.నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై.రామలక్ష్మి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.