విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అన్నారు.
“మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ( PTM-4) కార్యక్రమంలో భాగంగా కాళ్ల మండలం సీసలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె తన విద్యాభ్యాస రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, తమ తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలమేనని తెలిపారు. ఎన్నో కష్టాలకోర్చి తమను చదివించిన తల్లిదండ్రుల శ్రమను వృథా కానివ్వకుండా చదవడం వల్లే, ఈ రోజు మీ ముందు జాయింట్ కలెక్టర్ హోదాలో నిలబడగలిగానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, విద్య యొక్క ఆవశ్యకతను వివరించారు. గణితం, విజ్ఞాన శాస్త్రం సబ్జెక్టుల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. జాయింట్ కలెక్టర్ అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలు ఇచ్చారు. అనంతరం పాఠశాలలో ఇటీవల ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, సైన్స్ ప్రయోగశాలను, కంప్యూటర్ గదిని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులతో జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు.ముందుగా విద్యార్థులందరితో తమ తల్లిదండ్రుల పాదాలకు వందనం చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల నిరంతరం శ్రద్ధ వహించాలని, వారిని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో వసతులను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పాఠశాలను సందర్శించి తమ పిల్లల ప్రగతిని, ఉపాధ్యాయుల బోధనా తీరును, పాఠశాల అభివృద్ధిని గమనించాలని సూచించారు. త్వరలోనే తాను మళ్లీ ఈ పాఠశాలను సందర్శించి 9, 10 తరగతుల విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడతానని జాయింట్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పిజిఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, మండల తహసిల్దార్ సుందర్ సింగ్, మండల విద్యాశాఖ అధికారి డి. శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల ఏసుదాసు, ఎఎమ్ఓ చంద్రశేఖర్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు