Close

విద్యార్థులకు చిన్న నాటి నుండే పర్యావరణంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించడం ద్వారా, ప్లాస్టిక్ ని సమర్థవంతంగా నిరోధించవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 19/07/2025

మూడవ శనివారం స్వచ్ఛంద స్వర్ణంద్ర కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలన” పై తణుకు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతీ నెలా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతినెల ఒక థీమ్ తో నిర్వహిస్తున్నామని, ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల కార్యక్రమాన్ని చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ ను దశలవారీగా నిషేధించేందుకు గత ఆరు నెలలుగా కృషి చేస్తున్నామని అన్నారు. క్రమేపీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, ప్రత్యామ్నాయాలను కూడా అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలనలో, పారిశుధ్యాన్ని మెరుగు పరచడంలో క్లాప్ మిత్రాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిత రాయబారులు ఆశీర్వాదం, కృష్ణవేణి, కొండయ్య సన్మానించారు. వారు సమాజానికి చేస్తున్న పారిశుద్ధ్య సేవల వలనే నేడు మనం ఆరోగ్యంగా ఉంటున్నామని, మన వంతు చెత్త వేయకుండా వారికి తోడ్పాటు నివ్వాలని హితవు పలికారు. మీరందరూ ప్లాస్టిక్ ను రూపుమాపేందుకు కట్టుబడి ఉంటామని, పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తామని నాకు మాట ఇవ్వాలని అందరితో చెప్పించారు. యూజ్డ్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో పర్యావరణానికి కలిగే నష్టాన్ని వివరించారు. ఈ తరం ప్రజలు చేస్తున్న పొరపాట్లు రాబోయే తరాలకు నష్టాన్ని కలిగించరాదన్నారు. చెత్తతో భూమి, వాయువు, జలాలు కాలుష్యం కాకుండా ప్రజలు, పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులు చైతన్యంతో భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా పశ్చిమగోదావరి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనదనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు. పశువులు, మత్స్య సంపద మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతికి ఎలాంటి హానిలేని శ్రేయస్కరమైన గుడ్డ సంచులు, స్టీల్, కాగితపు గ్లాసులనే వాడాలన్నారు. ప్రకృతిని ప్రేమించే వారిగా నేటి విద్యార్థులు ఎదగాలని ఆయన సూచించారు. రానున్న తరాల కొరకు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలమని, మనం నివాసం నివసించే చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మానవ మనుగడకు పెనుభూతంగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలని సూచించారు.

తొలుత పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా రూపొందించిన ప్రదర్శనను పరిశీలించి విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

పాఠశాలలో ఏర్పాటు చేసిన, పాడైపోయిన కూరగాయల వ్యర్ధాలతో కంపోస్ట్ తయారు చేసిన అవగాహన చార్టులను, వాటి ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమంపై దృష్టి సారించామన్నారు. ఇలాగే జిల్లాలో మూడు ప్రాంతాలలో గుర్రపు డెక్క ద్వారా కంపోస్ట్ తయారుచేయడాన్ని ప్రారంభించి, శుక్రవారం నుండి అమ్మకాలను కూడా చేపట్టడం జరిగిందన్నారు. వీటిలో నాలుగు అత్యధిక పోషక విలువలు ఉంటాయని తెలిపారు. గుర్రపు డెక్కన్ తొలగించడం ద్వారా సాగునీటి ప్రవాహనికి అడ్డంకి లేకుండా రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, తహసిల్దార్ డి.వి.ఎస్.ఎస్ అశోక్ వర్మ, ఎంపీడీవో లోహిత్ సాగర్, ఉప విద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణ, ఎంఈఓ జీబీవీ ప్రసాద్, పాఠశాల హెచ్ఎం కే.పద్మావతి, ఎస్ఎంసి చైర్మన్ ఎం.వెంకటలక్ష్మి, స్థానిక నాయకులు తాతిపూడి మారుతి రావు, కలగర వెంకటకృష్ణ, ఒంటెద్దు రాజా, చీరల జగన్, పరిమి వెంకన్న బాబు, బసవ రామకృష్ణ, మంతిరావు బాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు