విజ్ఞానాన్ని పంచడంలో పుస్తకాలు ప్రధమ భూమికను పోషిస్తాయని, పుస్తకాలను అందజేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.

స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు బుధవారం ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మానవత సేవా సంస్థ కోశాధికారి గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, మిర్చిపాటి గున్నేశ్వరరావులు కాంపిటేటివ్ ఎగ్జామ్ లకు ప్రిపేర్ అయ్యే వారికి చదువుకునేందుకు ఉపయోగపడే, డిఎస్ సి, ఆర్ ఆర్ బి, గ్రూప్స్ సంబంధించిన మొదలగు పుస్తకములను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ పుస్తకములను జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించి భీమవరం వీరమ్మ పార్కు వద్ద ఉన్న భీమవరం శాఖ గ్రంథాలయం లైబ్రేరియన్ ఎస్.వెంకటేశ్వరరావుకు జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచే పుస్తకాలను అందజేయడం ద్వారా సమాజాన్ని తోడ్పటునందించాలన్నారు. ఈ రోజు అందించిన పుస్తకాలను గ్రూప్స్ మొదలగు పోటీ పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు ఉచితముగా చదువుకునేందుకు భీమవరం శాఖ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ అభ్యర్థులు ఉచితంగా పుస్తకాలు చదువుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పుస్తకాల దాతలు మానవతా సేవా సంస్థ కోశాధికారి గ్రంధి కుమార్ వెంకటేశ్వర వరప్రసాద్, మిర్చిపాటి గుణేశ్వరరావులను జాయింట్ కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్
ఎస్.వెంకటేశ్వరరావు, సంఘసేవకులు అల్లు శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.