వికసిత్ భారత్–2047, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా సమ్మిళిత, సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

Publish Date : 09/10/2026

వికసిత్ భారత్–2047, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా సమ్మిళిత, సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళికతో జిల్లాలో ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు…జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్థిక వృద్ధి అవకాశాలను గుర్తించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సూచించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో ఆమె ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యశాలలో జిల్లాలోని వివిధ రంగాల అభివృద్ధిపై చర్చించారు.

ప్రైస్ వాటర్‌ హౌస్‌ సంస్థ ప్రతినిధులు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానికంగా ఉన్న వనరులు, సంప్రదాయ రంగాలు, పారిశ్రామిక అవకాశాలు, వ్యవసాయం, ఆక్వా రంగం, పర్యాటక ప్రాంతాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాల ఆధారంగా జిల్లాలో ఆర్థిక వృద్ధిని పెంపొందించే ప్రణాళిక, కీలక అభివృద్ధి కేంద్రాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన అవకాశాలపై కార్యశాలలో వివరించారు.

అనంతరం వివిధ రంగాలకు చెందిన స్టేక్‌హోల్డర్ల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. జిల్లాలో ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు, పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతంపై వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

జిల్లాలో వరి సాగు, బియ్యం మిల్లింగ్, నిల్వ సదుపాయాలు, ఆక్వా సాగు, రొయ్యల ప్రాసెసింగ్, చేనేత, ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కార్యశాలలో వివరించారు. భీమవరం–ఆకివీడు ఆక్వా, వరి ప్రాంతం, తణుకు పారిశ్రామిక ప్రాంతం, తుండుర్రు మెగా ఫుడ్ పార్క్, పాలకొల్లు ప్రాసెసింగ్ కేంద్రం, పేరుపాలెం తీర ప్రాంతాలను కీలక అభివృద్ధి కేంద్రాలుగా గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

అలాగే రవాణా, సరుకు రవాణా వ్యవస్థలు, గిడ్డంగులు, పర్యాటక సదుపాయాలు, నైపుణ్య శిక్షణ, గ్రామీణ ఉపాధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక రూపొందించాలని వివరించారు. వికసిత్ భారత్–2047, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా సమ్మిళిత, సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యశాలలో ప్రైస్ వాటర్‌ హౌస్‌ సంస్థ మేనేజర్ బినయ్ సోరెంగ్, కన్సల్టెంట్ స్వస్తిక్ త్యాగి, కన్సల్టెంట్ ఎ. సాయి సిరి ప్రియ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కె. అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. సునీత, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.