వసతి గృహ నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తణుకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం కురిసిన అధిక వర్షాలు కారణంగా వసతి గృహంలోనికి కొద్దిపాటి నీరు చేరడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై దగ్గర్లో ఉన్న ప్రభుత్వ బిసి కళాశాల బాలికల వసతి గృహానికి తరలించి తాత్కాలికి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. వసతి గృహంలోనికి నీరు ప్రవేశించిన సమయంలో వసతి గృహ సంక్షేమ అధికారి లేకపోవడంతో తహసిల్దారు, మున్సిపల్ కమిషనర్లు పరిస్థితిని చక్కదిద్దిన విషయమై వారిని అభినందిస్తూ, హెచ్ డబ్ల్యు ఓ పై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఏ విషయమైనా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని హెచ్చరించారు. హాస్టల్ మొత్తం అన్ని గదులను పరిశీలించి మరమ్మత్తులు ఏమైనా ఉంటే ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. అనంతరం దగ్గర్లోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంను సందర్శించి తాత్కాలికంగా వసతి పొందిన సాంఘిక సంక్షేమ వసతి గృహం బాలికలను పరామర్శించారు. భయపడవలసిన అవసరం ఏమీలేదని, బుధవారం ఒక్క రోజునే అసాధారణమైన వర్షపాతం నమోదు కావడం వల్ల నీరు చేరే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తుందని, మీరందరూ బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని కోరారు.
ఈ సందర్భంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయ రాజు, సాంఘిక సంక్షేమ వసతి గృహం అధికారి వై.అరుణ, బీసీ సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం అధికారి సిహెచ్.కళ్యాణి, తణుకు తహసీల్దార్ డి వి ఎస్ ఎస్ అశోక్ వర్మ, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కె.శివ, స్థానిక నాయకులు, తదితరులు ఉన్నారు.


