Close

వసతి గృహాలలోని విద్యార్థిని, విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఫోన్ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 17/02/2026

పదవ తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులు కష్టపడి చదివి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి.

మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల పబ్లిక్ పరీక్షలు సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. కొంతమంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయపడతారని ఇటువంటి వారిని గుర్తించి మనోధైర్యం కల్పించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని వసతి గృహ అధికారులకు సూచించారు. సబ్జెక్టుపై పట్టు సాధించి ఉన్నత చదువులు కొనసాగిస్తే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అన్నారు. భీమవరంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో వుంటూ చదువుకున్న ముగ్గురు కళాశాల విద్యార్థినిలు ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగాలు సాధించారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. వసతి గృహాలలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఏమైనా విద్యాపరంగా సమస్యలు ఉంటే ఫోన్ ద్వారా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు అన్నారు. వసతి గృహాలలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు మధ్యలో డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలన్నారు. సంక్షేమ వసతి గృహాలలో ప్రవేశాలు నూరు శాతం ఉండేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం అంశాలపై దృష్టి పెట్టి బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి.అరుణ కుమారి, బిసి సంక్షేమ శాఖ అధికారి ఏ.వి సూరిబాబు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్ప రాణి, జిల్లాలోని వసతి గృహాల అధికారులు, వార్డెన్లు, వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.