వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉండేందుకు పరిశుభ్రతను ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
శనివారం ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో జరిగిన స్వర్ణాంధ – స్వచ్ఛాంధ్ర లో భాగంగా “వర్షాకాల పరిశుభ్రత” థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ చెత్త తొలగింపు కార్యక్రమంలో స్వయంగా పాల్గొని గ్రీన్ అంబాసిడర్స్ కు ప్రోత్సాహం ఇచ్చారు. అనంతరం దోమల నిర్మూలనకు గ్రామంలోని డ్రైయిన్ లో ఆయిల్ బాల్స్ ను విడిచి పెట్టారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ తొలుత పాఠశాల విద్యార్థులతో కలిసి చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో స్వయంగా చేసి చూపించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై వర్షాకాలం సీజన్లో వ్యాధులు బారిన పడకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనే అంశాలను విశదీకరిస్తూ, నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఇతర కారకాలద్వారా వచ్చే వ్యాధులు వేర్వేరుగా ఉంటాయని, వాటిని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. పరిశుభ్రతకు పాటించవలసిన అంశాలను, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పలు ప్రశ్నలను వేసి సమాధానాలను రాబట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతీ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని తీసుకోవడం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన నివారణా చర్యలపై ఈ నెల అంశంగా తీసుకొని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అన్నారు. అనారోగ్యం వల్ల డబ్బు, ఆరోగ్యం నష్టపోవడంతో పాటు, కుటుంబం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు. వర్షాకాలంలో అపరిశుభ్రత కారణంగా దోమలు, ఈగలు చేరి వాటి కారణంగా మలేరియా, డెంగ్యూ, డయోరియా, జ్వరాలు, జలుబు, దగ్గు, చర్మ రోగాలు వంటివి వ్యాప్తి చెందుతాయన్నారు. విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జంక్ ఫుడ్స్ ను, బయటి పదార్థాలను తినకూడదన్నారు. అమ్మ చేసిన ఆహార పదార్థాలనే తింటామని, అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తామని విద్యార్థులతో ముక్తకంఠంతో చెప్పించారు. వ్యక్తిగత, ఇంటి పరిశుభ్రతతోపాటు సామాజిక పరిశుభ్రత కూడా చాలా అవసరమని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతీఒక్కరి బాధ్యతని చెప్పారు. ఆ దిశగా ప్రతిఒక్కరూ చిత్తశుద్దితో కృషి చేసి స్వచ్చగ్రామాలను రూపొందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
చివరిగా స్వచ్ఛాంధ్ర సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం.రామనాథరెడ్డి, డీఈవో ఇ.నారాయణ, పాఠశాల హెచ్ఎం సిహెచ్.అక్బర్ చక్రవర్తి, భీమవరం డివిజనల్ అభివృద్ధి అధికారి వై.దోసి రెడ్డి, ఎంపీడీవో ఎన్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్, తహసిల్దార్ కె.నాగార్జున, ఉండి డిప్యూటీ తహసిల్దార్ ఎం.రాంప్రసాద్ రాజు, గ్రామ సర్పంచ్ కె.సాంబశివరావు, ఎంఈఓలు బి.వినాయకుడు, బి.జ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ టి.శ్రీనివాసరావు, డిఆర్సి ఎఫ్.టి కోఆర్డినేటర్ అడ్వర్డ్, ఎస్ఎంసి చైర్మన్ దేవిరెడ్డి శ్యామల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.