Close

వరి సాగులో డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 22/02/2025

శనివారం భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో వరి పంటకు సోకిన అగ్గి తెగులు నివారణకు డైసోక్లోజోల్ 75%ను డ్రోన్ ద్వారా వెదజల్లే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. డ్రోన్ ఆపరేటర్ మల్లుల శ్రీనివాసరావుతో మాట్లాడుతూ ఎంతవరకు చదువుకున్నారు, డ్రోన్ వినియోగంలో సహాయకులు ఎంతమంది ఉంటారు, ఎకరాకి ఎంత సమయం పడుతుంది, డ్రోన్ ఖరీదు ఎంత, రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయవచ్చు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీర్ చదువుకున్నానని వ్యవసాయం మీద మక్కువతో వరి సాగు తో పాటు, డ్రోన్ ఆపరేటింగ్ కూడా చేస్తున్నానని తెలిపారు. 2021లో విజయవాడ నుండి ఒక డ్రోన్ కొనుగోలు చేయడం చేయడం జరిగిందని కొంతకాలం వినియోగం తర్వాత దానిని అమ్మి, 2023 లో సుమారు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఒక డ్రోన్ ను స్వయంగా తయారు చేసి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరాకు మందును స్ప్రే చేసేందుకు రూ.400/- లు ఛార్జి చేస్తామని, సంవత్సరంలో సుమారు మూడు వేల ఎకరాలు భీమవరం, ఉండి, పెద్ద పుల్లేరు ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా క్రిమిసంహారక మందులను వెదజల్లడం జరుగుతుందన్నారు. సుమారు సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ఆదాయంలో పైలెట్, కో పైలెట్ జీతం, బ్యాటరీలు, డ్రోన్ చార్జర్స్ తదితర ఖర్చులు పోను సుమారు రూ. 6 నుండి 8 లక్షల వరకు డ్రోన్ ద్వారా సంపాదించగలుగుతున్నానని తెలిపారు. ఒక ఎకరాకు మందును వెదజల్లేందుకు ఐదు నుండి పది నిమిషాల్లో వరకు సమయం పడుతుందని, ఒక రోజుకు 40 ఎకరాలలో మందును స్ప్రే చేయొచ్చని తెలిపారు. డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వలన నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, అలాగే వరి క్షేత్రం మొత్తం సమానంగా మందను వెదజల్లడంతో మందు వృధా కాకుండా, సమయం కూడా చాలా తక్కువ పడుతుందన్నారు. రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, ప్రయోజనం చేకూరతాయని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదివి వరి సాగు, డ్రోన్ ఆపరేటింగ్ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. చాలామందికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. మరింత మందికి మీ ద్వారా డ్రోన్ లు ఫ్లై చేయడానికి శిక్షణ ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.

రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన “రైతు రిజిస్ట్రీ” ని సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

తుందుర్రు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి.దేవి స్వరూప రైతులను వివరాలు అడిగి చేస్తున్న రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంక్షేమ పథకాలు వర్తింప చేసేందుకు ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్టరిని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 1.15 లక్షల రైతులకు రైతు రిజిస్టరీ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు 75 వేల మంది రైతులు వివరాలను నమోదు చేసి గుర్తింపు సంఖ్యను అందజేయడం జరిగిందన్నారు. 1.15 లక్షల మంది రైతులలో 90 వేల మంది పీ.ఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. భూమి కలిగిన రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెలుతో కూడిన విశిష్ట సంఖ్యను మంజూరు చేయటం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు నెంబరు, ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ ఫోన్, పట్టాదారు పాసుపుస్తకం తీసుకొని దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వస్తె ఆన్లైన్లో వివరాలను నమోదు చేసి ఆధార్ కార్డు తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించడం జరుగుతుందన్నారు. దీని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేసే పంటల భీమా, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ పరికరాలపై రాయితీ, పంట నష్టపరిహారం, తదితర పథకాలను రైతులు సులువుగా పొందవచ్చు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలు కొరకు ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ విధానమును రైతులు సద్వినియోగ చేసుకోని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం ఈ-పంట నమోదు చేసిన వాటిలో కొన్ని సర్వే నెంబర్లను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమాల్లో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డిఆర్సీ ఈవో జి.బాల నాగేశ్వరి, మండల వ్యవసాయ అధికారి ఎన్.శ్రీనివాస్, తహసిల్దార్ రావి రాంబాబు, ఎంపీడీవో ఎం.మురళి గంగాధర్, గ్రామ సర్పంచ్ ఆరేటి వీరాస్వామి నాయుడు, ఎంపీపీ వాసు, ఏఈఓ బి.దేవీ స్వరూప, డ్రోన్ పైలెట్ ఎం.శ్రీనివాసరావు, రెవిన్యూ వ్యవసాయ శాఖ, రైతు సేవా కేంద్రం సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

1.11