లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

శనివారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అధారిటీ కమిటీ సమావేశంలో పి సి & పి ఎన్ డి టి యాక్ట్ అమలు, ఏ ఆర్ టి అండ్ సరోగసి యాక్ట్ అమలుపై సమీక్షించడం జరిగింది. తొలుత గత సమావేశంలో తీసుకున్న తీర్మానాలు కార్యాచరణపై చర్చించడం జరిగినది. అనంతరం జిల్లాలో పి సి & పి ఎన్ డి టి యాక్ట్ అమలు తీరులో భాగంగా స్కానింగ్ సెంటర్లు తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లు తదితర అంశాలపై చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమాజంలో స్త్రీ, పురుషు బేధం ఉండకూడదని, అన్ని రంగాల్లో స్త్రీలు ముందంజలో ఉంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్కానింగ్ సెంటర్లో వెల్లడించిన, పరీక్షలు నిర్వహించుకునే వారు ప్రలోభ పెట్టీ ఫలితాలను తెలుసుకుంటే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 161 స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలన్నారు. అలాగే ఏ విధమైన అనారోగ్య కారణాలు లేకుండా రెండవ కాన్పు, ఇద్దరు ఆడపిల్లలు ఉండి మూడవ కాన్పు అబార్షన్ చేయించుకున్న వారి జాబితాను క్రోడీకరించి విపులంగా సమీక్షించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అకారణ అబార్షన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 4 స్కానింగ్ సెంటర్లు, 4 స్కానింగ్ సెంటర్లు పునరుద్ధరణ, 6 స్కానింగ్ సెంటర్లు మార్పులు,1 స్కానింగ్ సెంటర్ రద్దుపై చర్చించి ఆమోదించడం జరిగింది. ఎ.ఆర్.టి లెవెల్ వన్ కు దరఖాస్తు చేసుకున్న రెండు సంస్థలకు అనుమతులు పై చర్చించడం జరిగినది. భీమవరం డివిజన్లో ఎనిమిది ప్రభుత్వ, 72 ప్రైవేటు మొత్తం 80 స్కానింగ్ సెంటర్లు, నరసాపురం డివిజన్లో 12 ప్రభుత్వ, 69 ప్రైవేటు మొత్తం 81 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయన్నారు. జిల్లాలో జూలై నెలలో 10 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2025 నుండి జూన్ 2025 వరకు జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లలో నమోదైన ఏఆర్టి అండ్ సరోగసి కేసులపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతా బాయి, ఫాగ్జీ ప్రతినిధి డాక్టర్ నరసవాణి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎంవీఎస్ భద్రిరాజు, తదితరులు పాల్గొన్నారు.