రోడ్డు భద్రత, ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు, కళాశాల విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు వినూత్నమైన ఆలోచనలతో అధికారులు కార్యాచరణ రూపొందించాలి.
ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
రవాణా, పోలీస్, ఆర్ అండ్ బి, వైద్యశాఖ, ఎన్.హెచ్ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.
ముందుగా జిల్లా రవాణా అధికారి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యల నివేదికను జిల్లా కలెక్టరకు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను నెలవారి సమీక్షించి, ప్రమాదాలకు గల కారణాలపై విస్తృతంగా చర్చించారు. 2025 సంవత్సరములో జిల్లాలో 520 రోడ్డు ప్రమాదాలలో 214 మంది మరణించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు జరగడంపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ముఖ్యంగా అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియమాల అమలును కఠినతరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించాలన్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం, సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్ల మలుపు ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రోడ్డు నిబంధనలు పాటించని వాహనం యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలన్నారు. వాహనదారులు ఇష్టానుసారం రోడ్ల పక్కన వాహనాలు పార్కింగ్ చేయకుండా మార్కింగ్ చేసి ఆ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో పార్కింగ్ ప్రదేశాలు నిర్దేశించకపోవడంతో ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారని, దీని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయా ప్రదేశాల్లో ఆక్రమణలను తొలగించి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై విచ్చలవిడిగా పశువులు సంచరించడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పశువుల యజమానులతో మాట్లాడి రోడ్లపై వదలకుండా చూడాలన్నారు. భీమవరం పట్టణంలోని ముఖ్య ప్రాంతాలలో వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేయాలన్నారు. రోడ్డు మార్జిన్లు ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు వినూత్నమైన ఆలోచనలతో కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో రోడ్డు భద్రతా చర్యలను పాటించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణకు బాధ్యతగా మెలగాలని తెలిపారు.
అనంతరం రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవలసిన తక్షణ చర్యలపై రవాణా శాఖ రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితర అధికారులతో ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్ పీ బీమారావు, జిల్లా రవాణాశాఖ అధికారి కె ఎస్ ఎం వి కృష్ణారావు, భీమవరం డిఎస్ పి రఘువీర్ విష్ణు, నరసాపురం డిఎస్పి శ్రీ వేద, తాడేపల్లి గూడెం డిఎస్పి డి.విశ్వనాథ్, ఆర్ అండ్ బి ఇ.ఇ ఏ.శ్రీనివాసరావు, డి అండ్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతాబాయి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.