రోడ్డు భద్రతకు అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, ఆర్టీవో, ఆర్ అండ్ బి, వైద్యశాఖ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు 172 ప్రమాదాలు జరగగా, 63 మరణాలు సంభవించాయని, అలాగే గత సంవత్సరం 194 ప్రమాదాలు జరగగా, 75 మరణాలు సంభవించినట్లు తెలిపారు. వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం, సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్ల మలుపు ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, త్రిబుల్ రైడింగ్ వంటి వాటిపై 446 కేసులు నమోదు చేసి 38 లక్షల 93 వేల 420 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేయడం జరిగిందన్నారు. రోడ్డు నిబంధనలు పాటించని వాహన యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలన్నారు. వాహనదారులు ఇష్టానుసారం రోడ్ల పక్కన వాహనాలు పార్కింగ్ చేయకుండా మార్కింగ్ చేసి ఆ ప్రదేశాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా మావుళ్ళమ్మ దేవస్థానం వద్ద వాహనాలు రాకపోకలకు అనువుగా తక్షణ చర్యలు చేపట్టాలని డీఎస్పీని, ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్ల జంక్షన్ ల వద్ద, ముఖ్యమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై విచ్చలవిడిగా పశువులు సంచరించడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక షెడ్ ని ఏర్పాటు చేసి అందులో పశువులను ఉంచేందుకు, వాటి పోషణకు స్వచ్ఛంద సంస్థల సహకారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయతో పనిచేసి జిల్లాలో ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప టిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు రోడ్లులో ప్రమాదాలకు కారణంగా ఉన్న మలుపులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ హెచ్ 216 లొసరి హైవేలో హై మాస్ట్ లైట్స్ వెలగడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లోసరి రోడులో వంతెనలు ఎక్కి దిగేటప్పుడు ఎత్తు పల్లాలుగా ఉండడం వలన ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, వీటిని వెంటనే సరిచేసి 15 రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు. తాడేపల్లిగూడెం దగ్గర బైపాస్ లో వన్ వే లో వాహనాలు వెళ్లడం ప్రమాదాలు కారణమవుతున్నాయని, రైలింగ్ నిర్మించిన వాటిని తొలగించి అదే రోడ్డును వినియోగిస్తున్నారని ఎన్ హెచ్ అధికారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఇదే విషయమై గత సమావేశంలో కూడా చర్చించడం జరిగిందని నాలుగు నెలలైనా కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీస్, రవాణా, ఎన్ హెచ్ అధికారులు పరిశీలించి పటిష్టమైన రైలింగ్ ను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు కూడా అమర్చాలని ఆదేశించారు. ఎవరైనా తొలగించడానికి ప్రయత్నిస్తే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ హెచ్ 165 దుంపగడప గ్రామం వద్ద ఎస్ కర్వ్ కారణంగా, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం రోడ్డు మార్జిన్ లు ఎగుడు, దిగుడులు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకురాగా, పోలీస్, రవాణా, ఎన్ హెచ్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
జిల్లా పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సీటు బెల్టు, హెల్మెట్ విధిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యాక్సిడెంట్ కేసులు సంబంధించిన సమాచారాన్ని ఎస్ హెచ్ ఓ లు ఐరాడ్ సైట్లో తప్పక నమోదు చేయాలన్నారు.
ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను జిల్లా రవాణా శాఖ అధికారి పి.ఉమామహేశ్వరరావు జిల్లా కలెక్టరకు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్.పీ వి.బీమారావు, జిల్లా రవాణా శాఖ అధికారి పి.ఉమామహేశ్వరరావు, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, కతీబ్ కౌసర్ బానో, డిఎస్ పిలు ఆర్.జి జై సూర్య, శ్రీ వేద, డి.విశ్వనాథ్, ఆర్ అండ్ బి అధికారి ఏ.శ్రీనివాస్, డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతాబాయి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు రంగ సాయి, తదితర అధికారులు పాల్గొన్నారు.