రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి రైతు కుటుంబాలకు అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ఈనెల 24 నుండి 29వ తేదీ వరకు నిర్వహించే “రైతన్న.. మీకోసం” వారోత్సవాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలి.
సాగును లాభసాటిగా మార్చడం, రైతులను వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పుల వైపుకు నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి “రైతన్న….మీకోసం” వారోత్సవాల నిర్వహణ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని ఆర్డీవోలు, వ్యవసాయ, ఉద్యాన, పశు, మత్స్యశాఖ అధికారులు, తహసిల్దార్లు, ఎంఏవోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాలు ఈనెల 24 నుండి 29వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి రైతుకు తెలియజేయాలన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి-టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన పద్ధతులు, సాంకేతికతలపై రైతన్నలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల ఇళ్లకు వెళ్లి వారి అవసరాలను నేరుగా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. పురుగుమందుల వాడకంలో లాభనష్టాలు, సేంద్రీయ విధానాల ప్రయోజనాల గురించి రైతులకు వివరించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు చెందిన బృందం రైతుల నుండి సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. ఈ బృందంలో రైతు సేవా కేంద్ర సహాయకులు, వీఆర్వో, పశుసంవర్ధక, విద్యుత్, ఇంజనీరింగ్ శాఖ సహాయకులు, అభ్యుదయ రైతు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ బృందాలు ప్రతిరోజు మూడు రైతు కుటుంబాలను కలిసి 20 నిమిషాల పాటు చర్చించి వివిధ అంశాలపై సమాచారం సేకరించి ఏపీఎ ఐ ఎం ఎస్ ఫార్మర్స్ యాప్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించిన ముఖ్యమంత్రి లేఖను రైతులకు అందించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం అభివృద్ధి చేసిన ఏపీఎ ఐ ఎం ఎస్ ఫార్మర్స్ యాప్ ను రైతుల సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించాలన్నారు. ఈ యాప్ ద్వారా పంటలు వివరాలు, రైతులు పండించిన పంటలకు సంబంధించిన ధరలు, భూ విస్తీర్ణం, పంటల బీమా వివరాలు, పంటల మట్టి నమూనాల విశ్లేషణ ఫలితాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు, ప్రభుత్వం ద్వారా రైతులకు అందే ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు. ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 3 తేదీ వరకు విశ్లేషణ చేసి రాబోయే రబి, ఖరీఫ్ పంటకు,26-27 సంవత్సర రబీ పంటకు యాక్షన్ ప్లాన్ తయారు చేసేందుకు రైతు సేవ కేంద్రాల వద్ద గ్రామసభలు నిర్వహించి రైతుల నుండి సలహాలు సూచనలు సేకరించాలన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, డి సి ఓ కే. మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.