రైతులు అధైర్య పడవలసిన అవసరం లేదని ధాన్యం సేకరణ లక్ష్యానికి మించి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని వశిష్ట సమావేశం మందిరం నందు మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతుల నుండి రబీ ధాన్యం సేకరణలో ఎదురౌతున్న సమస్యలపై సమీక్షించి ఆదేశించారు. సమావేశాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశాలను మంత్రికి వివరించారు. అనంతరం ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇప్పటి వరకూ తమతమ జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు, మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు.
తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రగతిని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వివరించినపుడు జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు సుమారు 4,88,225 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగిందని తెలిపారు. రైతులకు నగదు గడువు లోపుగా 24 గంటల్లోనే జమ కావడం జరిగిందన్నారు. అంచనాలకు మించి పంట దిగుబడి ఎక్కువగా రావడం వలన అదనపు ధాన్యం సేకరణకు అనుమతులను మంజూరు చేయాలని కోరడం జరిగింది. అదనపు ధాన్యం సేకరణకు ఇంకా సుమారు 30 లక్షలు గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయని తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి పరిష్కరించడం జరుగుచున్నదని వివరించారు.
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, దీనిని 7.50 లక్షలకు పెంచి అనుమతులు ఇవ్వాలని కోరారు. పెంటపాడు ప్రాంతంలో కొంత సమయం కోతలు ఆలస్యంగా వచ్చాయని, తాడేపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా 25,000 మెట్రిక్ టన్నులు అదనపు ధాన్యం సేకరణకు మంజూరు ఇవ్వాలని సభలో తెలిపారు. రైతులు ఖాతాల్లో డబ్బులు పడడానికి ఒక నెల రోజులు గడువు అయినా పర్వాలేదని, ధాన్యం కొంటే చాలని వివరించారు.
భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఊహించని రీతిలో పంట పండిందని, ఖరీఫ్ పంట వరదల కారణంగా పోయిందని, రబీలో 75 కేజీలు బస్తాల తూకంతో సుమారు 55 నుండి 60 బస్తాల దిగుబడి వచ్చిందన్నారు. అదనపు ధాన్యాన్ని కొనకపోతే రైతులు నష్టపోతారని తెలిపారు.
తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అదనపు ధాన్యం సేకరణకు అనుమతులు ఇవ్వాలని, గన్ని బ్యాగుల సమస్య కూడా ఉందని తెలిపారు. ఖరీఫ్ పంట షెడ్యూల్ తప్పడంతో తుఫానులు, వరదలు బారిన పడి పంట నష్టపోతున్నారని, జూన్ 10 నుండి జూలై 10 వరకు నాట్లు పడేలా షెడ్యూల్ ఉంటే తుఫాను ఇబ్బందులు ఉండవని తెలిపారు.
ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు పి.ధాత్రి రెడ్డి మాట్లాడుతూ జిల్లా ధాన్యం సేకరణ లక్ష్యం 3.53 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి రూ.487 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, అధికంగా పండిన పంటను దృష్టిలో ఉంచుకొని మరికొంత అదనపు ధాన్యం సేకరణకు అనుమతులను మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగింది.
సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్నడూ లేని రీతిలో రబీ, ఖరీఫ్ పంటల్లో రాష్ట్రలో 48.90 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమచేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 37 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వం రూ.1,674 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో, ఆ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించడం జరిగిందన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు నష్టపోకుండా తడిసి ధాన్యం అంతా కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం నిమ్ము 22 శాతం వరకూ ఉన్నా కొనుగోళ్లు జరపాలని అధికారులకు ఆయన ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభావితమైన పంటల ఎన్యూమరేషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్లను అదేశించామని ఆయన తెలిపారు. రైతులతో పాటు మిల్లర్ల హితం కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, రైతులకు అండగా నిలిచే ప్రభుత్వ కృషిలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. ఎమ్మెల్యేల సూచన, మిల్లర్ల కోరిక మేరకు అన్ని జిల్లాల్లో ఇకపై బ్యాంకు గ్యారంటీనీ ప్రమాణికంగా 1:2 గా అమలు చేస్తామని తెలియజేశారు. అలాగే రెండు జిల్లాల్లో సియంఆర్ టార్గెట్ ను అదనంగా పెంచామని, పశ్చిమగోదావరి జిల్లాకు ఒక లక్ష టన్నులు, ఏలూరు జిల్లాకు 50 వేలు టార్గెట్ లను పెంచుతున్నామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి సమావేశంలో చర్చించిన అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు.
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండి డా.మనజీర్ జిలాని సామూల్ మాట్లాడుతూ రైతు సేవ కేంద్రాల్లోని గన్ని బ్యాగులను ఉంచాలని, ధాన్యం సేకరణకు వినియోగిస్తున్న వాహనాల అనుమతులను వెంటనే మంజూరు చేయాలని, రైస్ మిల్లర్స్ కూడా జాప్యం లేకుండా ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు టి.రాహుల్ కుమార్ రెడ్డి, పి.ధాత్రి రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లాల రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, పౌరసరఫరాల సంస్థల జిల్లా మేనేజర్లు, పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు పాల్లొన్నారు.