Close

రైతులను ప్రకృతి సాగుకు ప్రోత్సహించి, వారికి మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు

Publish Date : 28/02/2025

నేలలో జీవవైవిద్యాన్ని పెంపొందించేందుకు 2025-26 సం.కు పకృతి సాగుకు రూపొందించిన ముందస్తు ప్రణాళికపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ వర్క్ షాప్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందులు వాడని ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2024-25 సంవత్సరంలో 13 వేల ఎకరాలలో పకృతి పంటల సాగు చేయగా, ఈ సంవత్సరం 50 వేల ఎకరాలను లక్ష్యంగా చేసుకొని ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రకృతి సాగు వలన పురుగు మందులు ఖర్చు బాగా తగ్గుతుందని, పండించిన పంటలకు మార్కెట్ విలువ కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు మార్కెటింగ్ వెసులుబాటును కూడా కల్పించినప్పుడే రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సాగుకు మళ్ళుతారన్నారు. గుర్రపు డెక్కన్ సద్వినియోగం చేసుకునేలా కంపోస్టుగా తయారుచేసి వినియోగించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం భీమవరం కలెక్టరేట్లో కూరగాయలు ఆకుకూరలు, బియ్యం, బెల్లం, పెరటి తోటలకు ఉపయోగించే రసాయనాలు, తదితరాలను ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలను చేపట్టడం జరిగిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే భీమవరం పట్టణంలోని ప్రకాశం రోడ్డు, జువ్వలపాలెం రోడ్డు లోని రెండు ప్రముఖ కూడళ్లను గుర్తించి కూరగాయలు తదితర ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మకాలకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. పకృతి సాగులో రైతు కష్టాన్ని తగిన ఫలితం తప్పకుండా ఉండాలని, రసాయనాలు పురుగుమందులతో పండించిన కూరగాయల కంటే కొంత ఎక్కువ మొత్తం ధరలను నిర్ణయించి కూరగాయలను విక్రయించాలన్నారు. ఆర్గానిక్ కూరగాయలు రుచి చాలా బాగుంటుందని, దీనితోపాటు ప్రజలకు ఆరోగ్యం కూడా చేకూరుతుందన్నారు. రైతులు పెద్ద మొత్తంలో కూరగాయలు పండించినట్లయితే జిల్లాలోని వసతి గృహాలు, పాఠశాలలో భోజనాలలో వినియోగించేందుకు ఆలోచన చేస్తామన్నారు. తద్వారా పిల్లలకు కూడా మంచి పోషకాహాలు అంది ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 383 గ్రామపంచాయతీలలోని 76 గ్రామపంచాయతీలలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ (ఏపీ సీఎన్ఎఫ్) పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 409 రైతు సేవా కేంద్రాలు ఉండగా 97 ఆర్ఎస్కేలు ఈ పథకం అమలు పరిధిలో ఉన్నాయన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 956 గ్రామ సంస్థలు (వివోస్) ఉండగా 175 వివోస్ ఈ పథకాన్ని 76 గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్నాయన్నారు. సహజ వ్యవసాయ పద్ధతులు, సహజ వ్యవసాయ ఇన్‌పుట్ తయారీ పద్ధతులపై రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
సాంప్రదాయ రైతులను సహజ వ్యవసాయం పద్ధతులను అనుసరించడానికి ప్రేరేపించాలన్నారు. దీని కొరకు ఋతుపవనాలకు ముందు బహుళ మొక్కల జాతుల నవదాన్య పొడి విత్తనాలను వెదజల్లి నేలలో సేంద్రీయ పదార్థం, సేంద్రీయ కార్బన్ కంటెంట్‌ను పెంచడానికి నవధాన్యాల కిట్లను అందజేయాలన్నారు. గ్రామ సంస్థలు స్వయం సహాయక సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేసి రసాయన అవశేషాలులేని ఆహార ధాన్యాలు మరియు కూరగాయలను పొందడానికి సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించడం, అలాగే సహజ వ్యవసాయ కిచెన్ గార్డెన్‌ల అమలుపై అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛంద – స్వర్ణాంధ్ర పేరిట విత్తనాలను సేకరించి స్వయం సహాయక సంఘ సభ్యుల గృహాల ఆవరణలో లేదా పైకప్పు లో సహజ వ్యవసాయ కిచెన్ గార్డెన్‌లను పెంచేలా చేయడంతో పాటు, మిగిలిన సహజ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహించాలన్నారు. ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘాలు వ్యవసాయ రైతులకు, సహజ వ్యవసాయ కిచెన్ గార్డెన్ ప్రాక్టీషనర్లకు సహజ వ్యవసాయ ఇన్‌పుట్‌లు, పీఎండీఎస్ సీడ్ కిట్‌లు, కిచెన్ గార్డెన్ సీడ్ కిట్‌లను సరఫరా చేయడానికి ఎంపిఎం దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు. పిఎండిఎస్ఎన్ సీడ్ కిట్‌లు (నవధాన్యాలు), కిచెన్ గార్డెన్ సీడ్ కిట్‌ల తయారీకి ఎస్ హెచ్ జిలు లేదా గ్రామ సంస్థలు రుణాలను సేకరించి విత్తనాల కిట్ లను రైతులకు, ఎస్ హెచ్ జి మహిళలకు సహేతుకమైన లాభంతో అమ్మకాలను చేపట్టాలన్నారు.

తొలుత వర్క్ షాప్ లో పాల్గొన్న రైతులు, అధికారులతో పకృతిని ప్రేమించడంతోపాటు, పర్యావరణానికి హానిలేని పకృతి వ్యవసాయాన్ని పాటిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, పిడి డిఆర్డిఏ ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, ఉండి కెవికె డైరెక్టర్ మల్లికార్జున రావు, పకృతి సాగు డిపిఎం నూకరాజు, డిస్టిక్ ఆర్టికల్చర్ అధికారి పి.దేవనంద కుమార్, వ్యవసాయ శాఖ ఏడీలు, ఎం ఏ ఓ లు, ఏ పీఎం లు, వీఎవోలు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

2.11 2.22 2.33