Close

రైతులకు రాజముద్ర తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సమన్వయంతో పనిచేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 24/01/2026

భీమవరం ఆర్డీవో కార్యాలయంలో శనివారం పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై డివిజన్లోని తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు, సచివాలయ సిబ్బందితో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతుల నుండి సమాచారాన్ని సేకరించి, రికార్డును నవీకరణ చేసి ఎటువంటి తప్పులు లేని రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల ఒక్కో నియోజకవర్గంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి రైతుల నుండి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించి ఎటువంటి తప్పులు లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి నెల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ ఉంటుందన్నారు. తహసిల్దారులు ఒక రోజంతా గ్రామంలో ఉండి గ్రామ సభ నిర్వహించి రైతుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో రైతులు సంతృప్తిపడే విధంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.