Close

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి.

Publish Date : 18/09/2025

..ఈ-పంట, ఈ-కెవైసి నమోదు నూరుశాతం పూర్తి చేయాలి.

..ఖరీఫ్ లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

గురువారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, తహసిల్దార్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది అన్నారు. త్వరలో మండలాల వారీగా ధాన్యం సేకరణకు లక్ష్యాలు నిర్దేశించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ మొదటి వారం నుండి రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు, ఆర్ఎస్కే లలో సిబ్బంది నియమించి వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు, క్విక్ రెస్పాన్స్ టీమ్ ను నియమించడం జరుగుతుందన్నారు. ఈ టీంలో తహసిల్దార్, మండల వ్యవసాయ శాఖ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఆర్ ఎస్ కె వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి ప్రతి ఆర్ ఎస్ కే వద్ద ఏర్పాట్లపై రైతులు, మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆర్ ఎస్ కే వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతుల తమ సమస్యలను క్యూఆర్ కోడ్ ద్వారా పై అధికారులకు తమ సమస్యలను తెలియజేస్తే క్విక్ రెస్పాన్స్ టీం సమస్యలను పరిష్కరిస్తుంది అన్నారు. జిల్లాలో ఎన్ని మిల్లులు ఉన్నాయి, ప్రతి మిల్లులో ఎన్ని గన్ని బ్యాగులు ఉన్నాయి, వాటిలో మంచివి,పాడైనవి వివరాలు నివేదిక పంపాలని తహాసిల్దార్లు ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టోడియన్ అధికారులను నియమించాలని, మండల స్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీ ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఏ ప్రాంతం నుండి ఎంతమేర ధాన్యం వస్తుంది అంచనా వేసి అందుకు అనుగుణంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు.ఏ ఏ మండలాలలో వరి పంట కోత దశలో ఉంది. ఒకవేళ రైతులు వరి కోసినట్లయితే ఎన్ని ఎకరాలలో కోతలు జరిగాయి, సంబంధిత వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగా తమకు తెలియజేయాలన్నారు. ధాన్యం సేకరణలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ గూగుల్ మీట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లాలోని మండల తాసిల్దార్లు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.