రైతులకు ఇబ్బంది లేని విధంగా సాగునీరు సాఫీగా పారేందుకు రానున్న రెండు నెలల్లో కాలువలు, డ్రైయిన్లు ఆక్రమణలను నూరు శాతం తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
బుధవారం ఉండి మండలం వాండ్రం గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా బలమైన గాలుల ప్రభావంతో నేలకొరిగిన వరి పంటను రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాండ్రం గ్రామంలోని 600 ఎకరాలకు సంబంధించిన నీరు ఇసుక డ్రెయిన్ ద్వారా వెళ్లవలసి ఉంటుందని, డ్రెయిన్ కుంచించుకుపోవడంతో సాగునీరు సాఫీగా పారుదల లేక పంట నష్టపోతున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా ఈ సమస్య పరిష్కారానికి ఆక్రమణలను తొలగించి వాస్తవంగా డ్రెయిన్ ఎంత ఉండాలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ వాండ్రం గ్రామంలో వరి పంట దెబ్బతిన్నదన్న సమాచారంతో నేడు పరిశీలనకు జిల్లా కలెక్టర్ తో కలిసి రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న 900 ఎకరాలకుగాను సుమారు 50 ఎకరాలు మేర వరి చేను నేలకొరిగిందని తెలిపారు. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో 80 శాతం మేర డ్రైయిన్లు, కాలువలపై ఆక్రమణలు తొలగించి నీటిపారుదల వ్యవస్థను స్థిరీకరించడం జరిగిందని, రానున్న రెండు మాసాలలో నూరు శాతం ఆక్రమణలు తొలగించి రైతు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలు తొలగించేందుకు ఇదే విధానం మార్గదర్శకం కావాలన్నారు. ఎంత వర్షం వచ్చినా పంట పొలాల్లో నీరు నిలవకుండా ఉండాలనదే లక్ష్యం అన్నారు. కుల మతాలకు అతీతంగా ఆక్రమణలు ఎవరివైనా తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కౌలుదారులకు సీసీఏ కార్డుల మంజూరులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఉండి తహసిల్దార్ నాగార్జున, వ్యవసాయ శాఖ ఏడి, రైతులు, తదితరులు ఉన్నారు.