Close

రేపు సెప్టెంబర్ 17న జిల్లాలో లాంఛనంగా ప్రారంభం కానున్న రాష్ట్రీయ పోషణ మాసం

Publish Date : 16/09/2025

8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ..

జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి

 

ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

పోషణ మాసోత్సవంలో పిల్లలకు సంబంధించిన వివిధ అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్థూలకాయం నివారణ, బాల్య దశ సంరక్షణ మరియు విద్య, శిశు మరియు చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు, పిల్లల సంరక్షణలో పురుషుల భాగస్వామ్యం, తదితర అంశాలపై సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ఒక నెల రోజులు పాటు అవగాహన కార్యక్రమాలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది సాధారణ ప్రమాదకరంగా మారిందన్నారు. దీనిలో బాల్య ఊబకాయం అనేది తీవ్ర సమస్య అని, కేవలం కొద్ది సంవత్సరాల్లోనే ఉబకాయమున్న పాఠశాల వయస్సు పిల్లల సంఖ్య పదిరెట్లు పెరిగిందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ఆహారపు అలవాట్లతో పాటు, రోజువారి దినచర్య, శారీరక శ్రమ, నిద్ర వంటి విషయాల్లో శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలలో మంచి ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని, పిల్లలను జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంచాలని, ఆరోగ్యకరమైన అల్పాహారం అలవాటు చేయాలని, పిల్లలను అతిగా తిననివ్వ వద్దని, తినేటప్పుడు సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని, శారీరక శ్రమ అలవాటు చేయాలని తెలిపారు. పోషణ మాసోత్సవాల ద్వారా తల్లిదండ్రులు పూర్తి అవగాహన పొంది తమ పిల్లలకు సరైన మార్గంలో శక్తివంతమైన పోషణను అందజేయాలని కలెక్టర్ తెలిపారు.