రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్లినిక్ లను ప్రజల సద్విని చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్..
రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం రెవిన్యూ క్లినిక్ ఏర్పాటు..
తొలి సోమవారం 59 రెవిన్యూ వర్జీలు స్వీకరణ…
జిల్లా రెవిన్యూ యంత్రాంగం జవాబు దారీతనంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
భీమవరం కలెక్టరేట్లో ఆవరణలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రెవిన్యూ క్లినిక్లను ప్రారంభించి, పనితీరు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో దరఖాస్తుల పరిశీలన, సలహా సూచనల విభాగము, 22-ఏ సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, సుమోటో అడంగల్ కరెక్షన్ సంబంధిత సమస్యలు, రీ సర్వే, విస్తీర్ణం తేడా, జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్ (ఎల్పిఎం) సంబంధిత సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యల విభాగాలున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు రెవెన్యూ క్లినిక్ ఏర్పాటుచేసి నేడు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ నూతన విధానం ద్వారా రెవెన్యూ సమస్యలు త్వరిత పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. జిల్లాలో ఎక్కువగా భూసంబంధ సమస్యలు ఉంటున్నాయని వాటన్నిటికీ రెవిన్యూ క్లినిక్ ద్వారా చక్కటి పరిష్కారం లభించనుందన్నారు.
ప్రజలందరూ రెవిన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకొని వారి భూ సంబంధ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈరోజు రెవెన్యూ క్లినిక్ ద్వారా 59 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. వాటిలో రెండు అర్జీలు ఇలా ఉన్నాయి..
@ పాలకొల్లు మండలం పెదమామిడిపల్లికి చెందిన వర్ధినిడి ధన వెంకట నాగేష్ సురేష్ అర్జీ సమర్పిస్తూ, తన భార్య, కుమార్తెల పేరు మీద ఆచంట మండలం కరుగోరు మిల్లిలో 5.21 సెంట్లు భూమి ఉందని, తన భార్య పేరున ఉన్న భూమిలో అరసెంటు, చిన్న కుమార్తె పేరున ఉన్న భూమిలో 16 సెంట్లు, పెద్ద కుమార్తె పేరున ఉన్న భూమిలో 3.5 సెంట్లు తగ్గి ఆన్లైన్లో నమోదు అయిందని, తగ్గిన 21 సెంట్లు భూమిని సరిచూసి ఆన్లైన్ చేయించవలసిందిగా కోరారు.
@ ఆకివీడు మండలం పెదకాపవరానికి చెందిన దాట్ల రంగరాజు అర్జీని సమర్పిస్తూ సరిపల్లి గ్రామంలో 1.15 సెంట్లు భూమి ఉందని, అడంగల్ లో 1.088 మాత్రమే నమోదు అయిందని, తన భార్యకు సరిపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 622లో 0.26 సెంట్లు తన పేరున వచ్చిందని సరిచేసి తన భార్య పేరున వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరరావు, వివిధ మండలాల తహసిల్దార్ లు రావి రాంబాబు, సుందర సింగ్, దసిక వంశీ సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఏడిద శ్రీనివాసరావు, ఏవి రామాంజనేయులు, కే ఆర్ సి సి తహసిల్దార్ సాయి కృష్ణ, డిప్యూటీ తహసిల్దారులు మర్రాపు సన్యాసిరావు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.