రాష్ట్ర ప్రభుత్వం విజన్ కు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని, విరివిగా రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన డిసిసి, డి.ఎల్.ఆర్.సి (బ్యాంకర్ల) సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజన్ కు అనుగుణంగా బ్యాంకులు జిల్లా అభివృద్ధికి సహకరించాలని స్పష్టం చేశారు. మన జిల్లా వరి సాగు ఆధారిత జిల్లాగా పేరుగాంచిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, ఇందుకు అనుగుణంగా కౌలు రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని తెలిపారు. వివిధ కారణాలతో రుణాల మంజూరులో జాప్యం చేయడం సరైనది కాదన్నారు. అవసరమైన ఏ పత్రాలనైనా అందజేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. రైతుకు వున్న వ్యక్తిగత రుణాలను వ్యవసాయ రుణాలకు సాకుగా చూపించరాదని, వ్యవసాయ రుణము అనేది తప్పనిసరిగా మంజూరు చేయాల్సిన విషయం అన్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి 1,08,330 సిసిఆర్సి కార్డులు జారీ లక్ష్యం కాగా ఇప్పటివరకు 87,178 కార్డులను జారీ చేయడం జరిగిందన్నారు. రభీ సీజన్లో లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో రూ.361 కోట్లు పంట రుణాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ సీజన్లో రూ.410 కోట్ల పంట రుణాలు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటికే రూ.162 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతివారం మంగళ, బుధవారాల్లో రెండేసి గ్రామాలు చొప్పున నిర్వహించడం జరుగుతుందని అన్ని బ్యాంకర్లు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. బ్యాంక్ కంట్రోలర్స్ ఈ విషయమై శ్రద్ధ వహించాలన్నారు. పసు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాల మంజూరు 6,011 వేలు లక్ష్యం కాగా, 4,026 మాత్రమే మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా పాల ఉత్పత్తుల్లో మూడో స్థానంలో ఉందని, రాష్ట్ర విజన్ కు అనుగుణంగా లక్ష్యానికి మించి రుణాలను అందజేయాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించి పీఎంఎఫ్బివై పంటల బీమా పథకంలో డిసెంబర్ 31, 2024 గడువు నాటికి పెద్ద మొత్తంలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ఎస్.హెచ్.జిలకు రుణాలు మంజూరు, ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్ లక్ష్యంగా రుణాలు మంజూరులో బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఎస్ హెచ్ జి మహిళలకు రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను మంజూరు చేసి వివిధ వ్యాపారాలు నెలకొల్పడానికి తోడ్పాటునివ్వాలన్నారు. జిల్లాలోని 20,061 గ్రామీణ ఎస్ హెచ్ జి గ్రూపులకు రూ.1,202.68 కోట్ల రుణాలు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.561.3 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగిందని, అలాగే 7,018 అర్బన్ గ్రూపులకు రూ.13,067.61 లక్షల రుణాలు లక్ష్యం కాగా, లక్ష్యానికి మించి 1,553 గ్రూపులకు రూ.21,991 లక్షల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. పీఎం స్వనిధి పథకం కింద వీధివ్యాపారస్తులకు 12,531 మందికి రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. స్టాండప్ ఇండియా, పీఎంఈజీపి, పి ఎం ఎఫ్ ఎం ఈ పథకాలపై సమీక్షించారు. చేనేతదారులకు ముద్ర యోజన రుణాలను విరివిగా మంజూరు చేయాలన్నారు.
నాబార్డ్ ఏజీఎం ఆర్.కె హనుమ కుమారి మాట్లాడుతూ ఈనాటి సమావేశం విషయాలను టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని బ్యాంకు మేనేజర్లకు తెలియజేసి, రుణాలు మంజూరును త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. బ్యాంకర్స్ మీటింగ్ కు కంట్రోలర్స్ మాత్రమే హాజరు కావాలని ఆదేశించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్.ఎం పి.సంగీత కుమారి మాట్లాడుతూ బ్యాంకర్లు కౌలుదారులకు రుణాలను అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. పొలంపిలుస్తుంది కార్యక్రమాలకు బ్యాంకర్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలను మంజూరు చేయడం ద్వారా జిల్లాలో డైరీ ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పాటునివ్వాలన్నారు.
ఆర్థిక అంశాల అవగాహనపై సందేహాలు, సమాధానాలు, వయోవృద్ధులకు ఆర్థిక అక్షరాస్యత, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తలకు సంబంధించిన బుక్ లెట్స్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ.నాగేంద్ర ప్రసాద్, ఆర్బిఐ ఏజీఎం ఆర్.కె. హనుమ కుమారి, యు బి ఐ ఆర్.ఎం పి.సంగీత కుమారి, నాబార్డ్ డీడీఎం టి.అనిల్ కాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకు కంట్రోలర్స్, బ్యాంకు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.