Close

రాష్ట్రంలో నిరంతరాయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా నేడు స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ చేపట్టడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.

Publish Date : 25/08/2025

సోమవారం పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొని, స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అధికారం ఇస్తే అభివృద్ధి వైపు నడపాలని, విధ్వంసం వైపు కాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో చేసిన సుమారు 15 లక్షల కోట్ల అప్పులను తీర్చే లక్ష్యంగా కృషి చేస్తూనే, అప్పులకు వడ్డీలను కూడా కడుతూ ఉండటంతో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన, మంచి పరిపాలన దక్షత కలిగిన మన ముఖ్యమంత్రి అన్ని పరిస్థితులను చక్కదిద్దుతూ సంక్షేమం, అభివృద్ధిని కొనసాగించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. సామాజిక పింఛన్లు రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు పెంచి అందించడంతోపాటు, మంచానికే పరిమితమైన వారికి రూ.10 వేలు, రూ.15 వేలు పెన్షన్లను అందించడం మన ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లను అందించడం లేదన్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగం రావాలని కోరుకుంటారని, మెగా డీఎస్సీ పేరిట 16,350 టీచర్ల పోస్టులను భర్తీ చేసుకోవడం జరిగిందన్నారు. అన్న క్యాంటీన్లలో తక్కువ రేటుకే అల్పాహారం, భోజనం అందజేయడం ద్వారా ప్రతిరోజు సుమారు 2.50 లక్షల పేదవారికి ప్రయోజనం కలుగుచున్నదన్నరు. రైతాంగానికిగానికి సంవత్సరానికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందజేస్తామన్న హామీ అమల్లో భాగంగా తొలి విడతగా కేంద్ర, రాష్ట్ర సాయంగా రూ.7 వేలు అందజేయడం జరిగిందన్నారు. పిల్లలు బాగా చదువుకుంటేనే కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగా ఉంటుందనే ఆలోచన చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబంలో ఎంత పంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.13 వేలు తల్లికి వందనం పేరిట జమ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 15న స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించకోవడం జరిగిందన్నారు. మత్స్యకారులకు రూ.20 వేలు అందజేశామని, అలాగే చేనేత కార్మికులకు జీఎస్టీ తగ్గించడం, పవర్ సబ్సిడీ, మగ్గం ఉన్నవారికి రూ.25 వేలు అందజేయడానికి క్యాబినెట్లో ఆమోదించడం జరిగిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళుతూనే, మన ఉప ముఖ్యమంత్రి పల్లె పండగ పేరిట ప్రతి గ్రామంలోనూ వాడవాడల సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో గుంటలు లేని రహదారుల నిర్మాణాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, రైల్వే జోన్ ను సాధించుకున్నామన్నారు. 2019 – 24 మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకపోగా, రూ.900 కోట్ల వ్యయంతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని నాడు వాళ్లు వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో నిరంతరాయంగా మన ముఖ్యమంత్రి కృషి చేస్తున్నరన్నారు. నేడు స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడ నుండైనా రేషన్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు, శివారు గ్రామాలకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రేషన్ డీలర్లకు మంచి గౌరవం కల్పించామని, వారు కూడా లబ్ధిదారులకు గౌరవ, మర్యాదలతో రేషన్ సక్రమంగా అందించాలన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేటి నుండి క్యూఆర్ కోడ్ ఆధారిత 5 లక్షల 51 వేల స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డులు స్థానంలో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైస్ కార్డులను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని కార్డుదారులందరికీ స్మార్ట్ రైస్ కార్డులను ఇంటింటికి వెళ్లి అందజేయడానికి నాలుగు దశల్లో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆగష్టు 25 నుండి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందజేయడం జరుగుతుందని, సచివాలయ సిబ్బంది పంపిణీ చేయగా మిగిలిన కార్డులను సెప్టెంబర్ 1 నుండి 15 వరకు రేషన్ షాప్ డీలర్ ద్వారా రేషన్ షాప్ వద్దకు వచ్చిన కార్డుదారులకు ePoS డివైస్ ద్వారా డీలర్ అందజేస్తారన్నారు. సెప్టెంబర్ 16 నుండి 20 వరకు ఇంకా మిగిలిన కార్డులను మళ్ళీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కార్డుదారుల ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుందన్నారు. అప్పటికీ కార్డులు తీసుకోకపోతే వాటిని సెప్టెంబర్ 21 తేదీన తగిన కారణాలతో తహ సీల్దార్ కార్యాలయంలో అందజేస్తారని, కార్డుదారులు అక్కడ నుండి పొందవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, డి.ఎస్.ఓ ఎన్.సరోజ, తహసిల్దార్ వై.దుర్గా కిషోర్, ఎ ఎస్ ఓ రవి శంకర్, స్థానిక నాయకులు రోజా రమణి, బోనం చిన్న బాబు, శ్రావణ కుమార్, అరుణ, తదితరులు పాల్గొన్నారు.