Close

రామకృష్ణ మిషన్ వధాన్యత మత్స్యకార కుటుంబాలలో చిరస్థాయిగా నిలుస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 28/02/2026

మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద 100 మంది పేద మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.70 వేల విలువైన బోట్లు, వలలు పంపిణీ…

జిల్లా కలెక్టర్ ఆలోచనతో రామకృష్ణ మిషన్ ఔదార్యంతో పేద మత్స్యకారి కుటుంబాలకు సమకూరిన బోట్లు, వలలు

బోట్లు అందుకున్న కుటుంబాల కళ్ళలో ఆనందం అనిర్వచనీయం

నేడు నరసాపురం తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొంది. మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద రాజమండ్రి రామకృష్ణ మిషన్ ఆర్థిక సహాయం రూ.70 లక్షల వ్యయంతో పేద మత్స్యకారులకు పడవలు, వలలు సమకూర్చగా, శనివారం పెద్దమైన వానిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 100 బోట్లు, వలలు ఉచిత పంపిణీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, రామకృష్ణ మిషన్ బేలూరు మర్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ స్వామి సత్యేష్ఆనంద్ జీ మహారాజ్ చేతులు మీదుగా అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ మిషన్ బేలూరు మట్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ స్వామి సత్యేష్ఆనంద్ జీ మహారాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మత్స్యకారులకు ఉగాది పండుగ ముందుగానే వచ్చినట్టుగా ఉందన్నారు. మొంథా తుఫాను వల్ల మత్స్యకారులకు అపారనష్టం కలిగిందన్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేసే దిశగా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు, జీవనభృతికి రాజమండ్రి రామకృష్ణ మిషన్ వారిని సంప్రదించి మత్స్యకారులకు పడవలు, వలలు అందించినట్లయితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు. రామకృష్ణ మిషన్ వెంటనే స్పందించి మత్స్యకారులను ఆదుకునేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. 300 మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని వారిని కోరగా ముందస్తుగా వారు రూ.70 లక్షలు ఖర్చు చేసి నేడు 100 మంది మత్స్యకారులకు బోట్లు, వలలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు రామకృష్ణ మిషన్ వారు అందించిన బోట్లు, వలలు భగవంతుని ప్రసాదంగా భావించి జీవనోపాధి ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పెదమైన వాని లంక గ్రామం సముద్ర కోతకు గురికాకుండా 13 కోట్ల రూపాయలతో రక్షణ కూడా నిర్మించడం జరుగుతుందని రామకృష్ణ మిషన్ స్వామీజీకి తెలియజేశారు.

నర్సాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ 100 మంది పేద మత్స్యకారులకు 70 లక్షల రూపాయలు వ్యయంతో 100 బోట్లను, వలలను ఉచితంగా అందిస్తున్న రామకృష్ణ మిషన్ వారిని ఈ సందర్భంగా అభినందించారు. రామకృష్ణ మిషన్ ద్వారా అందిన పడవలు, వలలు జాగ్రత్తగా వినియోగించుకోవాలని మత్స్యకారులను కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బేధాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి ఒకరికి, ఒకరు సహాయం చేసుకుంటూ జీవిస్తే ఎటువంటి సమస్యలు ఉండమన్నారు. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని స్వసక్తితో జీవించాలన్నారు. ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకొని మన చుట్టు పక్కల ఆపదలో ఉన్న ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందించాలన్నారు.

రామకృష్ణ మిషన్ బేలూరు మట్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ స్వామి సత్యేష్ఆనంద్ జీ మాట్లాడుతూ ప్రపంచానికి మేలు చేయడం కోసం అందరికీ సేవ చేయడమే మార్గమని దాని ద్వారా నువ్వు మోక్షం పొందుతావని స్వామి వివేకానంద సందేశించారని, వారి సందేశం అనుసరణీయంగా నేడు రామకృష్ణ మిషన్ ఎన్నో సమాజ హితమైన కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు వంటి గొప్ప గొప్ప నాయకులు జన్మించిన భూమి అని కొనియాడారు. ప్రతి ఒక్కరిలో దివ్యత్వం ఉందని, జాతి, కుల, మతాలు బేధం లేకుండా ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలను చేయవచ్చు అన్నారు. మీ జిల్లా కలెక్టరమ్మ చొరవతో రామకృష్ణ మిషన్ ప్రతినిధులుగా మేము ముందుకు వచ్చి ఈ సహాయాన్ని సమకూర్చడం జరిగిందన్నారు. దీనికి మూల కారణమైన మీ కలెక్టర్ ధన్యులని కొనియాడారు.

బోట్లు, వలలు అందుకున్న పలు కుటుంబాల సభ్యులు మాట్లాడుతూ మా జీవితంలో ఒక బోటుకు యజమాని అవుతామని కలలో కూడా మేము ఎప్పుడూ ఊహించుకోలేదని, నేడు బోటు, వలను అందజేసి మా కుటుంబాలు స్వసక్తిగా పనిచేసి ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా రామకృష్ణ మిషన్ చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేనిదన్నారు. మా జీవితం మొత్తంలోనే ఇది మాకు చాలా పెద్ద ఆనందకరమైన విషయం అన్నారు. గతంలో బోట్లు అద్దెకు తెచ్చుకుని నడుపుకోవడం, కొందరు వేరే పనులకు వెళ్లడం జరిగేదని నేడు అద్దెకి ఖర్చు చేయకుండానే సొంతంగా బోటుతో వేటకు వెళ్లి సంపాదించుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు, విశాఖపట్నం రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి శ్వాసంవేద్యనందజీ మహారాజ్, రాజమండ్రి సెక్రటరీ పరిజ్ఞయానందజీ మహారాజ్, అసిస్టెంట్ సెక్రటరీ సేవ్యనందజీ మహారాజ్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ అయ్యా నాగరాజు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎల్ ఎల్ ఎన్ రాజు, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసి రెడ్డి , డిపిఓ ఎం రామనాథరెడ్డి, గృహ నిర్మాణ సంస్థ అధికారి జిపిచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, పశ్చిమగోదావరి జిల్లా ఫిషరీస్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఎం.వసంతరావు, పెదమైన వానిలంక గ్రామ సర్పంచ్ కొల్లేటి కనకదుర్గ, మత్స్యకార మత్స్యకార కుటుంబాలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.