Close

రాబోయే రెండు నెలల్లో రీ-సర్వే ప్రక్రియను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 28/07/2026

జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోపు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం జాయింట్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీతో కలిసి రీ-సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ఐవీఆర్ఎస్ అంశాలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు, సర్వే అధికారులు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రీ-సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో పనుల పురోగతిని మండలాల వారీగా నిరంతరం సమీక్షిస్తూ, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులకు సూచించారు. భూ రికార్డుల ఆధునికీకరణలో రీ-సర్వే కీలకమని, ప్రతి దశలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న 22-ఏ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తహసీల్దారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్ఓఆర్, మ్యుటేషన్, ఎఫ్-లైన్ అంశాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ సందర్భంగా కొన్నిచోట్ల రైతుల నుంచి ప్రతికూల స్పందన వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఫిర్యాదులపై లోతుగా పరిశీలన చేసి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందన రాకుండా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా తహసీల్దారులు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఫిర్యాదుదారులను నేరుగా కలుసుకుని నిర్ణీత గడువులో కేసులను పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.ప్రభాకర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు, సర్వే అధికారులు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.