రానున్న ఉగాదికి లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందించేందుకు గృహ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రానున్న వేసవిలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి త్రాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ప్రజలకు త్రాగునీటి సరఫరా, టిడ్కో గృహాలు నిర్మాణ ప్రగతి, ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్, శానిటేషన్, డ్రైనేజీల నిర్వహణ తదితర అంశాలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ లతో మున్సిపాలిటీ వారిగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిలో పట్టణాలలో ఎటువంటి త్రాగునీరు కొరత లేకుండా ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు మున్సిపల్ కమిషనర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు సరఫరా చేసే త్రాగునీరును ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలన్నారు. పైప్ లైన్ ల ద్వారా త్రాగునీరు లీకేజీ లేకుండా ముందుగానే లీకేజీలను అరికట్టే చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణ శివారు ప్రాంతాలకు త్రాగునీరు సరఫరాచేసే వాటర్ ట్యాంకులు ప్రతిరోజు క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పురమిత్ర యాప్ ద్వారా లభించే సేవలపై ప్రజలకు తెలిసే విధంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణాల్లో హార్డింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం, రహదారి మరమ్మత్తులపై దృష్టి పెట్టాలన్నారు. దోమల నివారణకు సక్రమంగా ఫాగింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛత నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థల మెరుగుదల కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పన్నుల వసూళ్లలో లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజా ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సమీక్ష సమావేశంలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిహెచ్ నాగ నరసింహారావు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.