రాజకీయ పార్టీల సహకారంతోనే ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రాజకీయ పార్టీల సహకారంతోనే ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు-2026లను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో, జిల్లా ఎన్నికల పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో గురువారం జరిగిన “ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఎన్నికల ప్రక్రియ” పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచార సమయాల్లో, సభలు, ర్యాలీల నిర్వహణలో ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్తులపై రాతలు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషిద్ధమని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అభ్యర్థులందరూ ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి లోబడే ఖర్చు చేయాలని, ఖర్చు వ్యయం నిబంధనలు మించకూడదని స్పష్టం చేశారు.
పట్టణ స్థానిక సంస్థలు, జడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరు తేదీలను నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు.
* పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల షెడ్యూల్: అక్టోబర్ 14న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా, అక్టోబర్ 16న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 18 చివరి తేదీ. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయి. అక్టోబర్ 28న పోలింగ్, అవసరమైన చోట అక్టోబర్ 29న రీపోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
* ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్: అక్టోబర్ 19న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారుల ఎన్నికల నోటీసులు వెలువడనున్నాయి. అక్టోబర్ 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 24న పరిశీలన, అక్టోబర్ 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ, అక్టోబర్ 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటాయి. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతాయి. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఎన్నికల కోడ్ అమలును పర్యవేక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గరిష్టంగా నాలుగు సార్లు (4 సెట్లు) నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని, కాబట్టి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు అన్ని వివరాలను జాగ్రత్తగా చూసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ పరిధి దాటి లోపలికి వాహనాలకు అనుమతి ఉండదని అన్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వెళ్లే సమయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ మాట్లాడుతూ,
ప్రచార సమయంలో ఒకే చోట రెండు వేర్వేరు పార్టీలు ప్రచారం చేయకుండా, వేర్వేరు ప్రాంతాలలో పోలీసు ముందస్తు అనుమతితో ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. అప్పుడే ప్రశాంత వాతావరణంలో ప్రచారం కొనసాగుతుందని, లేదంటే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఏ ఒక్క పార్టీకి మద్దతుగా వ్యవహరించకూడదని, అంతా నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆదేశించారు. ఎవరైనా అధికారి తమ పదవులను దుర్వినియోగం చేసినట్లు తేలితే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పీ గ్లోరియా, జడ్పీ సీఈవో డి రమణ, జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి వై దోసి రెడ్డి, ఎలక్షన్ సెక్షన్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ హెచ్ ఎన్ సి శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి పి విజయ భాస్కర్, వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి డివిడి ప్రసాద్, టీడీపీ పార్టీ నుంచి యు చంద్రశేఖర్ , జనసేన పార్టీ నుంచి బి జై శివ, బీజేపీ పార్టీ నుంచి కె సురేంద్ర వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.