Close

రక్తదాన వారోత్సవాల ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 27/07/2026

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ (PGRS) సమావేశ మందిరంలో సోమవారం రక్తదాన వారోత్సవాలలో భాగంగా ప్రచార గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ‘స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు’ శాఖ ఆధ్వర్యంలో జూలై 28 నుండి జూలై 31 వరకు ఈ రక్తదాన ప్రచార వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ, డి.ఆర్.ఓ ప్రభాకర్ రావు, ఎస్.జి.ఎస్.డబ్ల్యూ అధికారి వెంకటలక్ష్మి, డ్వామా పి.డి డాక్టర్ కే.సి.హెచ్. అప్పారావు, పి.జి.ఆర్.ఎస్ పర్యవేక్షణాధికారి సి. దోసిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భద్రిరాజు లతో కలిసి సంయుక్తంగా గొడవ పత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. జిల్లాలో రక్తం కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో, రక్తదానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారాల్లో ఒక్కో ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
రెడ్ క్రాస్ మరియు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి 31 వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా జూలై 28న తాడేపల్లిగూడెం, 29న నరసాపురం, 31న భీమవరం డివిజన్లలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. అదే స్ఫూర్తితో అన్ని ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులు రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామీణ, వార్డు సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది అందరూ ఈ శిబిరాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.