యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు..
భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ట సమావేశ మందిరం నందు సోమవారం యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధమైన తత్త్వకవి అని అన్నారు. సమాజంలోని మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం నైతికత, మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించిన మహనీయుడు యోగి వేమన అన్నారు. ఆయన 17వ శతాబ్దానికి చెందినవాడిగా భావిస్తారని, సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో లోతైన తాత్విక భావాలను చెప్పిన గొప్ప కవి యోగి వేమన అని పేర్కొన్నారు. మొదట ఆయన సాధారణ జీవితాన్ని గడిపినా, ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించిన తర్వాత యోగిగా మారారని, కులభేదం, మూడనమ్మకాలు, ఆడంబరాలు, అజ్ఞానం వంటి వాటిని ఆయన తీవ్రంగా విమర్శించారన్నారు. వేమన రాసిన పద్యాలు ఎక్కువగా వేమన శతకముగా ప్రసిద్ధి చెందాయని, ఈ పద్యాలు నైతిక విలువలు, సమానత్వం, సత్యం, ఆత్మజ్ఞానం, మానవత్వం వంటి అంశాలను ప్రబోధిస్తాయని, ఆయన చెప్పిన బోధనలు నేటికీ ప్రజల్లో మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. సరళమైన భాష, సామాజిక సంస్కరణలపై దృష్టి,, ఆధ్యాత్మిక తత్త్వబోత, ప్రజల జీవితాలకు అన్వయించుకునే సందేశం వేమన కవిత్వం యొక్క ముఖ్యలక్షణం అన్నారు. యోగి వేమన తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారని, ఆయన పద్యాలు కాలాతీతంగా నేటికీ సత్యం, ధర్మం, జ్ఞానం గురించి మనకు బోధిస్తున్నాయన్నారు. యోగి వేమన జయంతి తెలుగు సంస్కృతి, సాహిత్యంలో ఒక విశిష్టమైనదిగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా.పి.లోకమాన్, ప్రోటోకాల్ సెక్షన్ డిప్యూటీ తహసిల్దార్ మర్రాపు సన్యాసిరావు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది.